FbTelugu

ఈటలపై ఉచ్చు బిగింపు!

ఈటల రాజేందర్‌ వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారింది. ఆయనకు మద్దతుగా ఆయన సొంత జిల్లా కరీంనగర్‌ నుంచి చాలామంది షామీర్‌పేటలోని ఈటల ఇంటికి బారులు కడుతున్నారు. అందులో టీఆర్‌ఎస్‌ నేతలు కూడా ఉన్నారు. ఆ జిల్లాలోని సర్పంచులు పెద్ద ఎత్తున ఈటలకు మద్దతు తెలిపారు. రోజురోజుకూ కరీంనగర్‌ జిల్లా నుంచి ఈటలకు మద్దతు పెరుగుతోంది. దీంతో సీఎం కేసీఆర్‌ దీనిని అడ్డుకొని ఈటలపై ఉచ్చు బిగించే పనిలో బిజీగా ఉన్నారట. అక్కడ ఈటలకు సహకరించే పార్టీ నేతలపైనా కన్నేశారట. అందులో భాగంగానే జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధును టార్గెట్‌ చేశారు. ఈ విషయాన్ని గ్రహించిన మధు అజ్ఞాతంలోకి వెళ్లారు. అయినా, పోలీసులు వెంటాడి ఏపీలో ఉన్న ఆయనను పట్టుకొని అరెస్టు చేశారు. పుట్ట మధును ఏ కేసులో అరెస్టు చేశారో ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు తాజాగా మధు భార్యను కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. కేవలం రాజకీయ నాయకులపైనే కాదు. అధికార వర్గాల్లో కూడా ఈటలకు సహకరిస్తున్నారన్న అనుమానాలు సీఎం కేసీఆర్‌కు ఉన్నాయట. అందులో ఇప్పటికే ఆర్డీఓ, ఏసీపీలను బదిలీ చేసింది. ఏసీపీకి పోస్టింగ్‌ ఇవ్వకుండా పోలీస్‌ శాఖకు అటాచ్‌ చేశారు. అంతటితో ఆగకుండా కరీంనగర్‌లోని తహసీల్దార్లను కూడా బదిలీ చేస్తున్నట్టు భూ పరిపాలన ప్రధాన కమిషనర్, సీఎస్‌ సోమేష్‌కుమార్‌ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

కరీంనగర్‌ జిల్లాలో ఈటలకు అనుకూలంగా ఉంటున్నారన్న భావనలో ప్రభుత్వం వీరిపై వేటు వేసింది. ఇలా జిల్లాలో ఈటలకు ఇంకా ఎవరు అనుకూలంగా ఉన్నారన్న అంశంపై పూర్తిస్థాయిలో నజర్‌ పెట్టి భూతద్దం పెట్టి వెతుకుతున్నట్టు సమాచారం. ఈటల రాజేందర్‌ ఇప్పుడు కేసీఆర్‌పై యుద్ధమే ప్రకటించారు. ముందుగా కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ స్థానం నుంచి తిరిగి ఎమ్మెల్యేగా పోటీచేసి తన సత్తాను చాటుకోవడంతో పాటు జిల్లాపై తిరుగులేని పట్టు సాధించాలన్న లక్ష్యాన్ని సాధించి కేసీఆర్‌కు చుక్కలు చూపించాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే దీని ప్రభావం ఉత్తర తెలంగాణ జిల్లాలపై పడుతుందని, కేసీఆర్‌కు ఇది పెద్ద దెబ్బే అవుతుందని రాజకీయ వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే కేసీఆర్‌ ఇలాంటి ప్రమాదాలు రాకుండా ముందుగానే ఆపరేషన్‌ ఈటలను ప్రారంభించారన్న ప్రచారం భారీగా సాగుతోంది. మరి ఈ ఆపరేషన్‌ కరీంనగర్‌లో ఈటల విజయం సాధిస్తారో.. కేసీఆర్‌ మంత్రాంగం ఫలిస్తుందో చూడాలి మరి.

You might also like

Leave A Reply

Your email address will not be published.