FbTelugu

గాడిన పెడుతున్నట్టేనా..?

ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీలో నైరాశ్యం చోటు చేసుకుంది. కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం పెంచే నేతలు కరువయ్యారు. ఏడాదిన్నర క్రితం జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది.

దీనికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్‌గాంధీ రాజీనామా చేశారు. ఆ తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీకి అధ్యక్షుడు లేకుండానే కొనసాగుతోంది. ఇదే పరిస్థితిని బీజేపీ తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ నేతలను తమ పార్టీలో చేర్చుకోవడాన్ని ప్రారంభించింది. మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని లాగేసుకుంది. అయినా, దీనిని అడ్డుకునే స్థితిలో కాంగ్రెస్‌ అధిష్టానం చేసిన ప్రయత్నాలేమీ లేవు.

తాజాగా రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టి తాము అధికారంలోకి రావాలని బీజేపీ సర్వశక్తులనూ ఒడ్డింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నించింది. కాంగ్రెస్‌ అసమ్మతి నేత సచిన్‌పైలట్‌ను తమ బుట్టలో వేసుకుంది. ఆయన వెంట 18మంది ఎమ్మెల్యేలు ఉండడంతో ఇక అధికారం తమదేనని బీజేపీ భావించింది. ఈ తరుణంలోనే రాహుల్‌గాంధీ, ప్రియాంకలు రంగంలోకి దిగారు. అక్కడి పార్టీ నేతలతో మాట్లాడారు. పరిస్థితిని చక్కదిద్దారు.

పార్టీలో ఉప్పు నిప్పుగా ఉన్న సీఎం అశోక్‌ గెహ్లాట్, అసమ్మతి నేత సచిన్‌ పైలెట్లతో మాట్లాడి పరిస్థితి చేయి దాటకుండా చూసుకున్నారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, వారు రంగంలోకి దిగారు. కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి ఇబ్బందులూ లేవు అన్న కాన్ఫిడెన్స్‌కు వచ్చారు. వారు ఇలాగే అన్ని రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిని చక్కదిద్దే పనిలో ఉంటే వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అన్న ధీమా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో కనిపిస్తోంది.

అయితే, ఇది కేవలం ఇంతటితో ఆగిపోతుందా.. లేక ఇలాగే ముందుకు సాగుతుందా..? కాంగ్రెస్‌ పార్టీకి మళ్లీ మునుపటి రోజులు రానున్నాయా..? అన్న అనుమానాలు తీరాలంటే మరికొన్ని రోజులు చూడాల్సిందే.

You might also like