FbTelugu

ఆర్టీసీ విభజన కాలేదా…?: హైకోర్టు విస్మయం

Isnt-the-RTC-split--High-Court-awe

హైదరాబాద్: ఒక వైపు ఎపీఎస్ ఆర్టీసీ విభజన పెండింగ్ లో ఉందని చెబుతున్నారు.. మరోవైపు కొత్తగా టీఎస్ ఆర్టీసీ ఏర్పాటు చేశామంటున్నారు.. ఇది ఎలా సాధ్యమని హైకోర్టు ప్రశ్నించింది. ఏపీఎస్ ఆర్టీసీ విభజన కోసం రెండు రాష్ట్రాలు కేంద్రాన్ని అనుమతి కోరాలి కదా? అని హైకోర్టు అడిగింది. కేంద్రం ఆమోదం లేకుండా రెండు కొత్త సంస్థలు ఎలా ఏర్పాటు చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఆర్టీసీ విభజన జరగకుండా ప్రభుత్వం ఎలా నోటిఫికేషన్ ఇస్తుందని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అసలు ఆర్టీసీ సమస్యను పరిష్కరించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా లేదా అని హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణ ఈ నెల 11 కు వాయిదా వేసింది.

టీఎస్ ఆర్టీసీకి చట్టబద్ధత లేదని, ఏపీఎస్ ఆర్టీసీ విభజన పూర్తి కాలేదన్న కేంద్రం తరఫు న్యాయవాది అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్ రాజేశ్వర రావు హైకోర్టుకు తెలిపారు. కేంద్రానికి 33 శాతం వాటా ఏపీఎస్ఆర్టీసీలో ఉందని, టీఎస్ ఆర్టీసీకి ఆటోమేటిక్ గా బదిలీ కాదని వాదించారు. ఆర్టీసీ సమ్మె పై కేంద్ర ప్రభుత్వం తరఫున రాజేశ్వర్ రావు వాదనలు వినిపించారు. అలాంటప్పుడు టీఎస్ ఆర్టీసీలో 33శాతం వాటా ప్రశ్నే తలెత్తదన్నారు. ఆర్టీసీ రీ ఆర్గనైజేషన్ కు తెలంగాణ ప్రభుత్వం తమ అనుమతి తీసుకోలేదన్నారు. షెడ్యూలు 9 కింద ఆర్టీసీ వస్తుందని తెలంగాణ సీఎస్ జోషి తెలిపారు. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం టీఎస్ ఆర్టీసీ ఏర్పాటు చేసినట్లు ఏజీ ప్రసాద్, ఆర్టీసీ ఎండీ సునిల్ శర్మలు తెలిపారు. అయితే ఆర్టీసీ విభజన అంశం కేంద్రం వద్ద పెండింగులో ఉందని ఏజీ వివరించారు.

ఆర్టీసీ యాజమాన్యం,కార్మికుల మధ్య సయోధ్య చేయాలని మేం ప్రయత్నిస్తున్నాం. కానీ ప్రభుత్వం, ఆర్టీసీ మాత్రం స్వచ్చందంగా ముందుకు రావడం లేదు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పూర్తిగా లోపించింది. మీరు 5 నిమిషాలు నా స్ధానంలో ఉండి నేను 5 నిమిషాలు మీ స్ధానంలో ఉండి చూడండి. మీ నివేదికలు… మీరు చెప్పే మాటలు నమ్మదగ్గ విధంగా ఉన్నాయా? హైకోర్టు ప్రశ్నించింది.

You might also like