FbTelugu

ట్రంప్‌లో మార్పునకు కారణం ఇదేనా..?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌లో ఇటీవల కాలంలో మార్పు వస్తుందా..? తను చేసిన నిర్ణయాలను తానే మార్చుకుంటున్నాడా..? ఈ మార్పులు ఎందుకోసం చేస్తున్నాడు..? అన్న ప్రశ్నలు అమెరికా వాసులతో పాటు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నాయి.

కరోనా దగ్గర నుంచి వీసాల నిషేధం వరకు అనేక నిర్ణయాలను తీసుకున్నారు. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా వాటిని అలాగే కొనసాగిస్తానని, వెనకడుగు వేసే ప్రసక్తేలేదని బల్లగుద్ది మరీ చెప్పారు. కానీ, పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఆయన చేసిన నిర్ణయాలను ఆయనే తిరిగి వెనక్కి తీసుకుంటున్నారు. తాజాగా ఆయన నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసాల విషయంలో, హెచ్‌1బీ, ఎల్‌1, జే1లో కొన్ని కేటగిరీల వీసాదారుల విషయంలో తీసుకున్న నిర్ణయాలను కూడా వెనక్కి తీసుకున్నారు.

వీటి నిషేధం విషయంలో కొంత సడలింపు ఇచ్చారు. జూన్‌ 22న వీసాలపై నిషేధం అమల్లోకి రాకముందు పనిచేసిన సంస్థల్లో వీసాదారులు తిరిగి చేరడానికి అనుమతిస్తామని అమెరికా సర్కార్‌ ప్రకటించింది. హెచ్‌1బీ వీసాదారులతో పాటు వారిపై ఆధారపడిన భాగస్వాములు, పిల్లలు కూడా వెంట రావచ్చని తెలిపింది. అమెరికాలో ఉపాధి పొందుతున్న వారు మళ్లీ ఆ సంస్థల్లో చేరేందుకు హెచ్‌1బీ, ఎల్‌1 వీసాలు జారీ చేయవచ్చని ఆ దేశం ప్రకటించింది. ఇలా ట్రంప్‌ చేసిన నిర్ణయాలను ఎందుకు మార్చుకుంటున్నారన్నదే ఇక్కడ ప్రధాన చర్చ. వచ్చే యేడాది ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ట్రంప్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

అయితే, ఈ ఎన్నికల్లో డెమొక్రాట్ల నుంచి ఆయనకు తీవ్ర పోటీ ఎదురవుతోంది. డెమొక్రాట్లకు ప్రధానంగా ఇండియా నుంచి అక్కడకు వెళ్లి స్థిరపడిన వారి మద్దతు ఉందని, ఇప్పుడు వీసాల రద్దులాంటి నిర్ణయాలు తీసుకుంటే ఇండియాతో పాటు వివిధ దేశాల నుంచి తనపై వ్యతిరేకత వస్తుందని ట్రంప్‌ భావించినట్టుగా ప్రచారం సాగుతోంది. ఇలా వివిధ దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన వారు తనకు వ్యతిరేకంగా ఓటు వేసే ప్రమాదముందని భావించి ట్రంప్‌ తన నిర్ణయాలను ఒక్కొక్కటిగా వెనక్కి తీసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ నిర్ణయాలు ట్రంప్‌ విజయానికి ఏ మేరకు ఉపయోగపడతాయో ఫిబ్రవరిలో తేలనుంది.

You might also like