FbTelugu

రేవంత్‌ విమర్శలకు కారణం ఇదేనా..?

దుబ్బాక ఎన్నికల్లో విజయం తర్వాత చాలామంది బీజేపీ వైపు చూస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే అదనుగా భావించి ఆ పార్టీ కార్యకర్తలు కూడా ఇతర పార్టీలకు చెందిన కొందరు ప్రముఖులు తమ పార్టీలో చేరేందుకు మంతనాలు నడుపుతున్నారని సోషల్‌మీడియాలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌కు చెందిన మంత్రి హరీష్‌రావు, కాంగ్రెస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా బీజేపీలో చేరుతున్నారన్న పుకార్లు జోరుగా వ్యాపించాయి.

ఈ నేపథ్యంలోనే రేవంత్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి, బీజేపీ నేత కిషన్‌రెడ్డిని టార్గెట్‌ చేశారు. తెలంగాణలో బీజేపీ, టీఆర్‌ఎస్‌లు రెండు కలిసి పనిచేస్తున్నాయని విమర్శలకు దిగారు. దుబ్బాక ఎన్నికల్లోనూ ఆ రెండు పార్టీలు కలిసి ఎత్తుగడతో పనిచేశాయని, అందులో భాగంగానే బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు విజయం సాధించారని అన్నారు. అంతేకాదు.. తన ఫోన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ట్యాపింగ్‌ చేస్తోందని ఆరోపణలు చేసిన కిషన్‌రెడ్డిపై విరుచుకు పడ్డారు. కేవలం ఆరోపణలు చేసి ప్రజలను పక్కదారి పట్టించడం కాదు. ఒకవేళ అదే నిజమైతే కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీనే కదా.. కేంద్రంలో స్వయంగా కిషన్‌రెడ్డి మంత్రిగా కూడా ఉన్నారు కదా.. అలాంటప్పుడు దీనిపై విచారణ జరిపి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ ప్రశ్నలు సందించారు. అదేవిధంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో కిషన్‌రెడ్డిపై అనేక కేసులు నమోదయ్యాయని, వాటిపై రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కూడా ప్రశ్నించారు. ఇలా.. ఒకరిని ఒకరు కాపాడుకుంటూ పైకిమాత్రం తాము ఇద్దరం శత్రువులమన్నట్టుగా ఆ రెండు పార్టీలు బయటకు నాటకాలాడుతున్నాయని తీవ్రంగా విమర్శలకు దిగారు. వారి జాతకాలన్నీ ఆధారాలతో సహ త్వరలోనే బయట పెడతానని కూడా చెప్పారు.

అయితే, రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణల్లో ఎంత నిజమున్నా.. అబద్దమున్నా, ఆయన మాత్రం బీజేపీని ఒక రేంజ్‌లో ఉతికి పారేశారు. వాస్తవానికి ఈ ఆరోపణలు చేయడానికి కారణం వేరే ఉందన్న ప్రచారం సాగుతోంది. రేవంత్‌ బీజేపీలో చేరుతున్నారన్న వార్తను కమలదళ కార్యకర్తలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే, ఇది వాస్తవం కాదని రేవంత్‌ చెప్పినా పెద్దగా ఉపయోగం లేదని భావించారట. అందుకే బీజేపీని, కిషన్‌రెడ్డిపై తీవ్రంగా విమర్శలకు దిగారని రాజకీయ పండితులు భావిస్తున్నారు. ఈ విమర్శలను విన్న వారు ఈ స్థాయిలో బీజేపీని ఆడుకుంటుంటే రేవంత్‌ ఇక ఆ పార్టీలో ఎందుకు చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మొత్తానికి బీజేపీ ప్రచారానికి రేవంత్‌ ఇలా అడ్డుకట్ట వేశారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.