FbTelugu

కేంద్రం ఆలోచన ఇదేనా..?

ఏపీలో రాజధాని పంచాయితీ జోరుగా నడుస్తోంది. చంద్రబాబు హయాంలో ఏపీ రాజధానిగా అమరావతిని ఎంపిక చేశారు. ఈ నిర్ణయానికి అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం జగన్‌తో పాటు అన్ని పార్టీలూ మద్దతు పలికాయి. స్వయంగా బీజేపీకి చెందిన ప్రధాని మోదీ వచ్చి శంకుస్థాపన చేసి వెళ్లారు. కానీ, జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మారింది. ఇప్పుడు ఏపీకి మూడు రాజధానులు ఉండాలని సర్కారు నిర్ణయం తీసుకుంది.

దీనికి శాసనమండలి ఆమోదం లేకపోయినా గవర్నర్‌.. సర్కారు నిర్ణయానికి ఆమోదముద్ర వేశారు. ఈ నేపథ్యంలో విపక్షాలన్నీ భగ్గుమన్నాయి. అమరావతే రాజధాని అని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఎప్పటి నుంచో చెబుతోంది. అయితే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్ణయంలో తాము వేలు పెట్టబోమని, అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని చెబుతోంది. రాష్ట్ర బీజేపీ కూడా దీనిపై పెద్దగా స్పందించడం లేదు. దీంతో ఇప్పుడు బీజేపీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కావాలనే ఇప్పుడు బీజేపీ సైలంట్‌గా ఉంటోందని, పరోక్షంగా రాజధాని విషయంలో వైసీపీకి సహకరిస్తోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే, బీజేపీ నిర్ణయం వెనుక చాలా పెద్ద రాజకీయ కారణాలే ఉన్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది.

రాజధాని మార్పు నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలకు కట్టబెడితే.. అది కూడా ఏపీ నుంచే ప్రారంభం అయితే.. దానిని తమకు అనుకూలంగా మార్చుకునే ఆలోచనలో ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏపీలో అది అమలైతే.. దానిని బేస్‌ చేసుకొని తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా రాజధానులను మార్చే ఆలోచనలో ఉన్నట్టుగా బీజేపీ పావులు కదుపుతోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అవసరమైతే రాజధాని మార్పు నిర్ణయాన్ని రాష్ట్రాలకు కట్టబెట్టేలా చట్టం కూడా తీసుకురావచ్చన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. తమ ఆలోచనలకు అనుగుణంగా ఏపీలో ఇప్పుడు పరిణామాలు ఉండడంతో పరోక్షంగా దానికి సహకరించేలా కేంద్రం నడుచుకుంటుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, కేంద్రం కనుక ఇలాంటి నిర్ణయం తీసుకుంటే.. రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష్టం వచ్చిన ప్రాంతాలకు రాజధానులు మార్చుకుంటే.. పాలకపక్షాలు మారిన ప్రతిసారీ రాజధానులు మార్చుకునే అవకాశం ఉంటుంది కదా.. ఇలా అయితే రాష్ట్ర ప్రజలపై భారం పడుతుంది కదా అన్న ప్రశ్న రాజకీయ విశ్లేషకులతో పాటు సామాన్యులను కూడా వేధిస్తోంది. చివరకు రాజధాని మార్పు మీద కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

You might also like