దేశంలో కరోనా రాకెట్ స్పీడుతో దూసుకుపోతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో వీటి స్పీడు మరింత ఎక్కువగా ఉంది. రోజుకు వేలాదిమంది కరోనా బారిన పడుతున్నారు. మరణాల సంఖ్య కూడా జెట్ స్పీడులోనే ఉన్నాయి.
దీనికి ప్రధాన కారణంగా లాక్డౌన్ సడలింపులేనన్న విషయం సర్కారుకు కూడా తెలిసి వచ్చింది. అయితే, దీనిపై ఏం చేయాలో తెలియక సర్కారు తలలు పట్టుకుంటోంది. దీనిని నియంత్రించకపోతే దేశమే అల్లకల్లోలం అవుతోంది. మళ్లీ లాక్డౌన్ విధిస్తే దేశ ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారుతోంది. దీంతో ఆదాయం ముఖ్యమా.. ఆరోగ్యం ముఖ్యమా అన్న ప్రశ్న ఉదయిస్తోంది.
దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో తెలియక సర్కారు మల్లగుల్లాలు పడుతోంది. ఈ నేపథ్యంలోనే కరోనాతో దూసుకుపోతున్న కొన్ని నగరాల్లో మళ్లీ లాక్డౌన్ విధిస్తే ఎలా ఉంటుందా అన్న చర్చ సర్కారు పెద్దల్లో ఉందన్న ప్రచారం సాగుతోంది. తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్ నగరం కరోనా కేసులతో అతలాకుతలం అవుతోంది. ఇలాంటి నగరాలు దేశంలో చాలా ఉన్నాయి. వాటన్నింటిలోనూ దాదాపుగా ఇదే పరిస్థితి. అందుకే ఈ నగరాల వరకు లాక్డౌన్ విధిస్తే ఎలా ఉంటుందన్న చర్చ జోరుగా సాగుతోంది. దీనిపై ఢిల్లీ పెద్దలతో పాటు రాష్ట్ర సర్కారు కూడా ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి. అయితే, హైదరాబాద్ నగరవాసులు మాత్రం మళ్లీ లాక్డౌన్ విధించడం ద్వారానే కరోనా నియంత్రణ సాధ్యమవుతుందని, అదే మంచి నిర్ణయమని అభిప్రాయపడుతున్నారు.