FbTelugu

ఆరుగురి హత్యలు అందుకోసమేనా?

విశాఖపట్నం: జుత్తాడలో అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటనలో సస్పెన్స్ వీడింది. ఇప్పటి వరకు ఒకటి రెండు విషయాలు వెలుగు చూసినప్పటికీ పోలీసుల విచారణలో అసలు నిజం వెల్లడైంది.

వివాహేతర సంబంధమే ఆరుగురు హత్యలకు కారణమని తాజాగా వెలుగుచూడ్డంతో ఆశ్చర్యానికి గురయ్యారు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం అప్పలరాజు అనే వ్యక్తి కుటుంబాన్ని మొత్తం మట్టుబెట్టాడనే ఆరోపణలు ఉన్నాయి. బత్తిన అప్పలరాజు కుమార్తెతో విజయ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కుమార్తెతో సంబంధం వద్దని వారించినా వినకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. విజయ్ కుటుంబంపై పెందుర్తి పోలీసు స్టేషన్ లో అప్పలరాజు 2018లో ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి ఆగ్రహంతో ఉన్న అప్పలరాజు గురువారం తెల్లవారు జామున ప్రత్యక్షంగా రంగంలోకి దిగాడు. విజయ్ తండ్రి రామారావుతో సహా ఆరుగురు కుటుంబ సభ్యులను కత్తితో దారుణంగా హతమార్చి పారిపోయాడు. దాడి సమయంలో విజయ్ లేకపోవడంతో బతికిపోయాడు.

పోలీసులు అప్పలరాజును అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. పోలీసులకు అందిన సమాచారం ఇలా ఉండగా విజయ్ ఆస్తి కోసమే అప్పలరాజు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆస్తి కోసం కొద్ది రోజులు గా రెండు కుటుంబాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. అప్పలరాజు ను తమ ముందుకు తీసుకువచ్చేవరకు మృతదేహాలను కదలనిచ్చేది లేదని బంధువులు పోలీసులకు స్పష్టం చేశారు. ప్రస్తుతం అప్పలరాజు కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.