FbTelugu

జగన్‌ ఆలోచన అదేనా..?

ఏపీలో జగన్‌ రాజకీయ తంత్రాన్ని ఉపయోగిస్తున్నాడా.. విపక్షమైన తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసేందుకు కొత్త పథకాన్ని అమలు చేస్తున్నాడా..? వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ కోలుకోకుండా ఉండేందుకు పాచికలు వేస్తున్నాడా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది.

ఏపీలో టీడీపీ అధికారం కోల్పోయి జగన్‌ పీఠం ఎక్కిన నాటి నుంచి రాష్ట్రంలో రాజకీయంగా పావులు కదుపుతూనే ఉన్నారు ఆ ఇద్దరు. వైసీపీని ఇరుకున పెట్టేందుకు టీడీపీ కూడా అందివచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూనే ఉంది. వైసీపీ కూడా రాష్ట్రంలో టీడీపీని కనుమరుగు చేసే పనిలో బిజీగానే ఉంది. అయితే, దానిని వైసీపీ మరింత కొత్త తరహాలో వినియోగించుకుంటున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ నుంచి విజయం సాధించిన 23 మంది ఎమ్మెల్యేలను తమవైపునకు తిప్పుకునేందుకు వైసీపీ తీవ్రంగానే ప్రయత్నించింది.

దీనిలో చాలావరకు విజయం సాధించింది. అయితే, వైసీపీ నాయకులు కూడా అనేకసార్లు చంద్రబాబు విధానాలు నచ్చక ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాతో చర్చలు జరుపుతున్నారంటూ చెబుతూనే ఉన్నారు. ఆ మాట చెప్పిన ప్రతిసారీ ఒకరో, ఇద్దరో టీడీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాంరాం చెబుతూనే ఉన్నారు. అదే సమయంలో మరికొంతమంది కూడా మాతో టచ్‌లో ఉన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ, ఆ తర్వాత వ్యవహారం మళ్లీ సర్దుమణుగుతోంది. మళ్లీ కొన్నాళ్లకు ఒకరో ఇద్దరో గోడ దూకడం లాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. వాస్తవానికి టీడీపీ నుంచి వైసీపీకి వెళ్లేందుకు చాలామంది ఎమ్మెల్యేలు ఎప్పుడో జగన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే, జగన్‌ ఆలోచన ప్రకారం ఒకేసారి అందరూ కాకుండా అప్పుడప్పుడూ కొంతమంది చేరుతూ ఉంటే టీడీపీ, చంద్రబాబు మైండ్‌సెట్‌ మీద దెబ్బ కొట్టినట్టవుతుందన్న ఆలోచనతోనే విడతల వారిగా వారిని వైసీపీలో చేర్చుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

అలా వైసీపీలో చేరేవారంతా పార్టీ మారడానికి ముందు చంద్రబాబు, లోకేష్‌పై విమర్శలు చేస్తున్నారని కూడా అభిప్రాయపడుతున్నారు. ఇప్పట్లో అసెంబ్లీ ఎన్నికలు లేవు. వాటికి చాలాకాలం ఉంది. కాబట్టి టీడీపీ నేతలను అప్పటివరకూ విడతల వారీగా చేర్చుకుంటూ పోతే అసెంబ్లీ ఎన్నికల నాటికి చంద్రబాబు టెన్షన్‌కు గురవుతారని, చివరి నిమిషంలో ఎమ్మెల్యేలను తిప్పుకుంటే అప్పుడు అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు ఇబ్బంది పడాల్సి ఉంటుందని, ఆ సమయంలో తాము జనాల్లోకి వెళ్లిపోతామన్న ఆలోచనలో జగన్‌ ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. అందులో భాగంగానే ఇటీవల టీడీపీ ఎమ్మెల్యేలు కరణం బలరాం, శిద్దా రాఘవరావులు చంద్రబాబు, లోకేష్‌పై ఘాటుగా విమర్శలు చేశారన్న వాదన కూడా వ్యక్తమవుతోంది. చంద్రబాబును ఘాటుగా విమర్శించి, జగన్‌ను పొగిడిన మరుసటి రోజే శిద్దా రాఘవరావు వైసీపీలో చేరారు. ఇలా చంద్రబాబును ఇరుకున పెట్టేలా జగన్‌ వ్యూహం పన్నారన్న చర్చ ఏపీలో జోరుగా సాగుతోంది. వాస్తవానికి మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా వైసీపీ బాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నా వారిని కొంతకాలం వేచి ఉండాలని జగన్‌ ఆదేశించినట్టు కూడా చర్చ సాగుతోంది. ఈ రాజకీయ పోరాటంలో చివరకు చంద్రబాబు విజయం సాధిస్తారా.. జగన్‌ వ్యూహం ఫలిస్తుందా తేలాలంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఆగాల్సిందే మరి!

You might also like