FbTelugu

ఏపీ సీఎస్ బదిలీకి శ్రీదేవి కారణమా?

Is-Sridevi-responsible-for-AP-CS-Transfer-

అమరావతి: ప్రధాన కార్యదర్శి ఎల్వీ.సుబ్రహ్మణ్యం బదిలీకీ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కారణమనే ఆరోపణలు బలంగా విన్పిస్తున్నాయి. షోకాజ్ నోటీసులు అందుకున్న జీఏడీ ముఖ్య కార్యదర్శి, సీఎం కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ అని అనుకున్నప్పటికీ శ్రీదేవి వైపే వేళ్లు చూపుతున్నాయి. ఉండవల్లి శ్రీదేవి తాడికొండ నియోజకవర్గం నుంచి మొన్న జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు. ఈ నియోజకవర్గం ఎస్సీ కి రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. మొన్నటి గణేష్ ఉత్సవాల సందర్భంగా టీడీపీ వర్గానికి, ఎమ్మెల్యే శ్రీదేవికి మధ్య వివాదం జరిగింది. తాడికొండ నియోజకవర్గంలోని అనంతవరంలో గణేష్ మండపానికి వచ్చిన ఆమెను టీడీపీ కార్యకర్తలు వ్యతిరేకించారు. తుల్లూరు మండలంలో జరిగిన గణేష్ మండపంలో ఇదే విధంగా వ్యతిరేకించారు. మాజీ సీఎం వైఎస్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నేరుగా వచ్చిన ఆమెను టీడీపీ కార్యకర్తలు వ్యతిరేకించి, తిప్పి పంపించారు. దళితురాలు కాబట్టే తనను గణేష్ మండపానికి రానివ్వడం లేదని అప్పట్లో ఆమె ఆరోపించారు. దీనిపై ఆగ్రహించిన ఆమె తుల్లూరు పోలీసులకు నలుగురు వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద ఫిర్యాదు చేసింది. జాతీయ ఎస్సీ కమిషన్ కు కూడా ఫిర్యాదు చేయడంతో రాజకీయమైంది. ఈ విషయమై సీఎం జగన్ కు వివరించారు. ఏపీ డీజీపీని కలిసి కేసును విచారించాలని కోరింది.

ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న టీడీపీ నాయకత్వం జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్, రాష్ట్రపతి కు ఫిర్యాదు చేసింది. శ్రీదేవి హిందువు కాదని, క్రిస్టియన్ అని ఆధారాలతో సహా ఫిర్యాదు సమర్పించింది. దీనిపై వివరాలు అందచేయాల్సిందిగా కొద్ది రోజుల క్రితం రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఏపీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ.సుబ్రహ్మణ్యానికి నోటీసులు వచ్చాయి. శ్రీదేవి క్రిస్టియన్ కాదు, హిందువేనంటూ నిర్ధారించి నివేదిక పంపించాల్సిందిగా సీఎం జగన్ కార్యాలయం సుబ్రహ్మణ్యం మీద ఒత్తిడి తెచ్చింది. రాష్ట్రపతి కార్యాలయం నుంచి నోటీసులు వచ్చాయని, వాస్తవ నివేదిక పంపించాల్సిన బాధ్యత తనపై ఉందంటూ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. ఆ పని చేయలేను అని చెప్పడం సీఎం కార్యాలయానికి మింగుడుపడలేదు. మన మాట విననప్పుడు ఇంకా కొనసాగించడం కుదరదంటూ ఆయనపై ఆఘమేఘాల మీద బదిలీ వేటు వేశారని సచివాలయ వర్గాలు అంటున్నాయి.

రాష్ట్రపతి కార్యాలయానికి వాస్తవ నివేదిక వెళ్తే ప్రమాదముందనే భావనతోనే తప్పించారంటున్నారు. శ్రీదేవిపై కులం ఆధారంగా వేటు పడితే, అది ఒక్కరితోనే ఆగిపోదని అంటున్నారు. చాలా మంది ఎస్సీ ఎమ్మెల్యేలు తమ పదవులు కోల్పోవడం, ఉప ఎన్నికలు జరగడం ఖాయం. ఎస్సీలు మతం మారితే బీసీలు అవుతారనేది జనంలోకి బలంగా వెళ్తుంది. అయితే కేంద్రం ఈ విషయాన్ని అంత సలువుగా వదిలే పరిస్థితులు లేవని అంటున్నారు.

You might also like