FbTelugu

సోముపై నమ్మకం లేకేనా..?

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై పార్టీ అధిష్టానానికి నమ్మకం కుదరడం లేదా.. రాష్ట్రంలో బీజేపీని అధికారంలో తేవడం.. పార్టీని బలోపేతం చేయడం ఆయన వల్ల కాదన్న నిర్ణయానికి వచ్చిందా..? ఆయన నాయకత్వాన్ని నమ్ముకుంటే తిరుపతిలో మట్టికరవడం ఖాయమని భావిస్తుందా.. అందుకే తిరుపతి ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను రంగంలోకి దింపుతున్నారా.. అన్న అనుమానాలు బీజేపీ కార్యకర్తలతో పాటు అన్ని రాజకీయ పార్టీలనూ వేధిస్తున్నాయి. వాస్తవానికి కన్నా లక్ష్మీనారాయణ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన పార్టీ గళాన్ని పెద్దగా వినిపించలేదని, అధికార వైసీపీ వైఫల్యాలను ఎండగట్టడంలో దూకుడును ప్రదర్శించలేదన్న భావనతో ఆయనను తొలగించి రాష్ట్ర అధ్యక్ష పదవిని సోము వీర్రాజుకు అప్పగించారు.

వీర్రాజు అధ్యక్షుడైన తర్వాత ఆయన గళాన్ని మరింతగా పెంచారు. అయితే, ఆయన గళం అధికార పార్టీపైన కాకుండా ప్రతిపక్ష టీడీపీపైనే ఆయన ఎక్కుపెట్టారు. దీంతో వైసీపీ కంటే టీడీపీనే టార్గెట్‌ చేయడంతో బీజేపీ–వైసీపీ మధ్య ఏదో బంధం ఉందన్న అనుమానాలు బాగా ప్రచారం అయ్యాయి. ఆ రెండు పార్టీల మధ్య అనుబంధం ఉండడం వల్లే వైసీపీపై కాకుండా టీడీపీపై విమర్శలు చేస్తున్నారన్న అనుమానాలు ఏపీ జనాల్లో వ్యక్తమయ్యాయి. ఈ సమయంలోనే తిరుపతి పార్లమెంట్‌ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. తెలంగాణలో దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయంతో హైప్‌ వచ్చినట్టుగానే తిరుపతిలో కూడా విజయం సాధిస్తే ఏపీలో కూడా పార్టీ బలోపేతం అవుతుందని కమలనాథులు భావించారు. కానీ, తెలంగాణలో నేరుగా అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌నే బీజేపీ టార్గెట్‌ చేసింది. ఇప్పుడు ఏపీలో మాత్రం వీర్రాజు నేతృత్వంలోని బీజేపీ అధికార వైసీపీని కాదని టీడీపీని టార్గెట్‌ చేస్తోంది. పైగా తిరుపతి ఎంపీ స్థానం వైసీపీదే. దీంతో వైసీపీని టార్గెట్‌ చేయడంలో సోము వీర్రాజు ఫెయిలయ్యారన్న భావనలో కమలనాథులు ఉన్నారట. పైగా రెచ్చగొట్టి జనాల నోళ్లలో నానే వ్యాఖ్యలు చేయడంలో సోము వీర్రాజు వెనుకబడ్డారట. అందుకే ఆయనను నమ్ముకుంటే తిరుపతిలో విజయం సాధ్యం కాదని భావించిన బీజేపీ అధిష్టానం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను రంగంలోకి దించిందట.

ఇప్పటికే ఆయన రెండుసార్లు తిరుపతి పార్లమెంట్‌ స్థానం పరిధిలో పర్యటించారు. అక్కడ తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. బైబిల్‌ పట్టుకునే పార్టీ కావాలా.. భగవద్గీత పట్టుకునే పార్టీ కావాలా.. తేల్చకోండి అని తిరుపతి ఓటర్లకు ఒక సవాల్‌ కూడా విసిరారు. పైగా సోము వీర్రాజు పార్టీలో సీనియర్ల సహకారం లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పార్టీకి అందివచ్చిన అవకాశాలను సైతం ఆయన వృథా చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. తాజాగా బీజేపీ అధిష్టానంతో భేటీలోనూ ఇవే అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. దీంతో సోము కంటే తెలంగాణలో బీజేపీని పరుగులు తీయిస్తున్న బండి సంజయ్‌పైనే అధిష్టానానికి విశ్వాసం పెరుగుతోంది. అందుకే ఆయనను రంగంలోకి దించుతున్నారని కమలం పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. పైగా బండి సంజయ్‌కు రెండు తెలుగురాష్ట్రాల బాధ్యతలు అప్పగిస్తారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బీజేపీ నేతల వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి మరి.

You might also like

Leave A Reply

Your email address will not be published.