FbTelugu

వారిద్దరికీ చెడిందా..?

ఏపీ సీఎం జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య ఎంతో మిత్రత్వం ఉండేది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో వైసీపీకి అనుకూలంగా టీఆర్‌ఎస్‌ మంత్రులు నేరుగా అక్కడికి వెళ్లి మరీ ప్రచారం చేశారు.

తెలంగాణ ఎన్నికల్లో కూడా వైసీపీ కేసీఆర్‌కు మద్దతునిచ్చింది. వీరిద్దరూ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనేక సందర్భాల్లో కలిసి పనిచేశారు. ఒకదశలో హైదరాబాద్‌లో తనకు క్యాంపు కార్యాలయం కావాలని కోరిన జగన్‌కు కేసీఆర్‌ అభయహస్తం ఇచ్చారు. ఆయన ఎక్కడ కావాలంటే అక్కడ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ప్రకటించారు. శత్రువుకు శత్రువు మిత్రుడవుతాడన్న సామెత వీరికి సరిగ్గా సరిపోయింది. తెలంగాణలో టీడీపీని లేకుండా చేసిన కేసీఆర్, ఏపీలోనూ ఆ పార్టీ ఓడిపోవాలని కోరుకున్నారు. అందుకే అక్కడ జగన్‌కు మద్దతిచ్చారు.

గతంలో తెలంగాణలో జగన్‌ పర్యటనలను అడ్డుకున్న టీఆర్‌ఎస్‌ చివరకు చంద్రబాబుపై కోపంతో జగన్‌కు పూర్తిగా అండగా నిలవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏపీలో చంద్రబాబు ఓటమి పాలై జగన్‌ అధికారంలోకి వచ్చారు. దీంతో ఇద్దరూ కలిసి చంద్రబాబును ఇబ్బందులకు గురిచేసే కార్యకమాలను విజయవంతం చేస్తున్నారు. ప్రతి విషయంలోనూ ఒకరికొకరు సహకరించుకుంటూ మంచి మిత్రులుగా మెలిగారు. అయితే ఇప్పుడు వారిద్దరి మధ్య జలజగడం మొదలైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కృష్ణా నీటి వాడకంలో వీరిద్దరి మధ్య తేడాలు వచ్చాయని.. ఒకరి నిర్ణయంపై మరొకరు ఆగ్రహంతో ఉన్నారన్న ప్రచారం కూడా భారీగా సాగుతోంది.

కృష్ణా నీటి విషయంలో జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని కేసీఆర్‌ తప్పుబట్టారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించడం తీవ్ర అభ్యంతరకరమన్నారు. ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విభజన చట్టానికి విరుద్ధమని.. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్నాయని.. ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి న్యాయ పోరాటం చేస్తామని కేసీఆర్‌ అన్నారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై వెంటనే కృష్ణా వాటర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డులో తెలంగాణ ప్రభుత్వం తరఫున ఫిర్యాదు చేయాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సంప్రదించకుండానే ఉమ్మడి ప్రాజెక్టుగా ఉన్న శ్రీశైలం నీటి విషయంలో నిర్ణయం తీసుకోవడం.. అపెక్స్‌ కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టు నిర్మాణం చేయాలనుకోవడం ఏపీ చేసిన తప్పిదాలన్నారు కేసీఆర్‌. ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి రాజీలేని ధోరణి అవలంభిస్తామన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగితే రాజీపడే ప్రసక్తే లేదని.. ఏపీ తలపెట్టిన కొత్త ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుని తీరడమే లక్ష్యంగా న్యాయపోరాటం చేస్తామన్నారు. అయితే, ఏపీకి హక్కుగా కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటామని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ వద్ద కాల్వల విస్తరణ పనులు చేపట్టాలని భావిస్తున్నామన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి పరిమితులు విధించాలనుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. శ్రీశైలంలో 881 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కుల నీటిని తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ స్థాయిలో నీటిమట్టం సంవత్సరంలో సగటున పది రోజులకు మించి ఉండడం మహాకష్టం. ఈ పదిరోజుల్లోనే హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా కరువు పీడిత రాయలసీమ సహా నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీళ్లు వెళ్లాలి. ఎవరైనా మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలని వ్యాఖ్యానించారు.

బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాల మేరకు కృష్ణా నదీ యాజమాన్య సంస్థ (కేఆర్‌ఎంబీ) అందుబాటులో ఉన్న కృష్ణా జలాలను కేటాయిస్తుందని గుర్తుచేశారు. ఇది తమ హక్కని. కేటాయింపులకు లోబడి రాయలసీమ దుర్భిక్ష నివారణ ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తామన్నారు. జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయల్‌ సాగర్‌ల నుంచి శ్రీశైలంలోకి నీళ్లు రాకముందే తెలంగాణ జలాలను తీసుకోగలుగుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీటిని వాడుకోవడానికి, కరువు పీడిత రాయలసీమ ప్రాంతానికి సాగునీరు ఇవ్వడానికి ఒక సదుపాయం మాత్రమే ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. ఇలాంటి పరిస్థితులలో మాకు పరిమితులు విధించాలనడం ఎంతవరకు సమంజసమని జగన్‌ అన్నారు. ఎవరెన్ని నీళ్లు వాడుకోవాలో కృష్ణా ట్రిబ్యునల్‌ నిర్ణయించిందని, కృష్ణా బోర్డు ఆ పంపకాలను పర్యవేక్షిస్తోందని.. అలాంటప్పుడు ఎవరైనా దీనిని రాజకీయం చేయడం సమంజసం కాదని జగన్‌ తెలిపారు. ఆనాడు ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి మానవత్వంతో ఆలోచించడం వల్లే తెలంగాణ ప్రాంతంలో శ్రీశైలం నుంచి పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల నిర్మాణానికి సన్నద్ధత గానీ.. కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా తక్కువ నీటి మట్టం ఉన్నప్పుడు కూడా నీళ్లు తెచ్చుకోగలుగుతున్నారన్నారు. ఇప్పుడే ఏపీలోని కరువు పీడిత ప్రాంతానికి నీళ్లివ్వాలంటే.. పరిమితులు విధించడం కరెక్టు కాదు. మన నీళ్లు మనం తీసుకుంటాం అని కుండబద్దలు కొట్టిచెప్పారు. మొత్తానికి ఈ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు మాత్రం తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య జలజగడం ప్రారంభమైందని అభిప్రాయపడుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.