FbTelugu

యువనేత ఆయనేనా..?

ఏపీ తెలుగుయువత అధ్యక్ష పదవిని త్వరలోనే భర్తీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ఇప్పటికే మండలస్థాయి వరకు దాదాపుగా పూర్తి చేశారు. ఇక లోక్‌సభ నియోజకవర్గాల వారీగా కమిటీలను నియమించనున్నారు. ఆ తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర కమిటీల నియామకం పూర్తి చేస్తారని పార్టీవర్గాలు అంటున్నాయి. దీనిలో భాగంగానే తెలుగు యువత అధ్యక్ష పదవిని కూడా భర్తీ చేస్తారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

ఈసారి రాయలసీమకు ఈ పదవి ఇవ్వాలనుకుంటున్నారట. ఈ క్రమంలోనే అనూహ్యంగా ఊహించని పేరు తెరపైకి వచ్చింది. పరిటాల శ్రీరామ్‌కు ఈ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. దాదాపు పదవి ఖాయమైందని తెలుగు తమ్ముళ్లు సోషల్‌ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఈ రెండు పదవులపై త్వరలోనే ప్రకటన వస్తుంది అంటున్నారు. ముందు ఈ పదవికి రామ్మోహన్‌ నాయుడు పేరు తెరపైకి వచ్చినా.. అచ్చెన్నకు ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉండటంతో.. ఒకే కుటుంబంలో రెండు పదవులు ఇచ్చారనే విమర్శలు వస్తాయనే ఉద్దేశంతో పరిటాల పేరును పరిశీలించినట్లు తెలుస్తోంది.

తెలుగు యువత పదవి గతంలో దేవినేని అవినాష్‌కు ఇచ్చారు. కానీ ఆయన వైఎస్సార్‌సీపీలో చేరడంతో ఆ పదవి ఖాళీగానే ఉంది.. ఇప్పుడు మళ్లీ పరిటాల శ్రీరామ్‌ పేరు బలంగా వినిపిస్తోంది. మరి చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఈ సారి ఎవరూ అనుకోని విధంగా తెలుగుయువత అధ్యక్ష పదవికి పరిటాల శ్రీరామ్‌ పేరు తెరపైకి రావడంతో ఆ పార్టీ కార్యకర్తలు కూడా ఆశ్చర్యపడుతున్నారు. అయితే, ఆయనను యువనేతగా ప్రకటిస్తే పరిటాల కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉన్నట్టుగా ఉంటుందని కూడా వారు అభిప్రాయపడుతున్నారు.

You might also like