FbTelugu

ఒకే గొడుగు కిందకు నీటి పారుదల

హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మిస్తున్న భారీ ప్రాజెక్టుల ద్వారా వచ్చే నదీ జలాలను వీలైనంత ఎక్కువ వ్యవసాయ భూములకు అందించే విధంగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

వీలైంతన ఎక్కువ మంది రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించడానికి మించిన ప్రాధాన్యం ప్రభుత్వానికి మరోటి లేదని, దీనికోసం ఎంత ఖర్చయినా పెట్టడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. నీటి పారుదల శాఖలోని అన్ని విభాగాలను వెంటనే ఒకే గొడుగు కిందకి తీసుకురావాలని ఆదేశించారు.

వివిధ ప్రాజెక్టుల కాల్వల ద్వారా ఇప్పటి వరకు సాగునీరు అందని ప్రాంతాలను గుర్తించి, వాటికి సాగునీరు అందించే ప్రణాళికపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. గోదావరి, కృష్ణా నదులపై ఎంతో వ్యయం చేసి, ఎన్నో అవరోధాలను అధిగమించి ప్రభుత్వం భారీ ప్రాజెక్టులను నిర్మిస్తున్నది. పెండింగ్ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసింది. ఉద్యమ స్పూర్తితో చెరువులను పునరుద్ధరించిందన్నారు.

తెలంగాణలో చెరువులు, చెక్ డ్యాములు ఎప్పుడూ నిండే ఉండాలని, ఫలితంగా భూగర్భ జలమట్టం పెరిగి రైతులు దాదాపు రూ.45 వేల కోట్ల వ్యయం చేసి వేసుకున్న బోర్లకు నీరందుతుంది. అటు కాల్వలు, ఇటు చెరువులు, మరోవైపు బోర్ల ద్వారా వ్యవసాయం సాగుతుందని సీఎం చెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితంగా ఎస్ఆర్ఎస్పీ వరకు రెండు టిఎంసిల నీటిని తరలించే వెసులుబాటు కలిగింది. కాబట్టి ఎస్ఆర్ఎస్పి పరిధిలో 30 లక్షల ఎకరాల్లో రెండు పంటలు పండించాలని సీఎం అన్నారు. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో కూడా ఎప్పుడూ 25 నుంచి 30 టిఎంసిల నీటిని అంబాటులో ఉంచాలని కోరారు. అవసరానికి తగ్గట్టు, పరిస్థితులకు అనుగుణంగా ఎస్సారెస్పీని వాడుకోవాలి. గోదావరి నుంచి నీరు వస్తే నేరుగా ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి నీరు తీసుకోవాలి. లేదంటే శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం ద్వారా నీటిని తరలించాలని సీఎం చెప్పారు.

ఎస్ఆర్ఎస్పి పరిధిలోని వరద కాలువ, కాకతీయ కాలువ మధ్య దాదాపు 139 చెరువులున్నాయి. వాటిలో కొన్నింటికి నీరు అందడం లేదు. అలా నీరు అందని చెరువులను గుర్తించాలని కేసీఆర్ కోరారు. ఈ ఏడాది కృష్ణా నదిలో కూడా ఎక్కువ నీటి లభ్యత ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే నారాయణ పూర్ రిజర్వాయర్ నుంచి నీరు వదిలారు. కాబట్టి వెంటనే జూరాల, భీమా 2 లిఫ్టుల ద్వారా నీటిని చెరువుల్లోకి తరలించాలి. రామల్పాడు రిజర్వాయర్ నింపాలి. కల్వకుర్తి లిఫ్టు ఇరిగేషన్ డి 82 డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పనులను వేగంగా పూర్తి చేసి, ఈ ఏడాదే 30 వేల ఎకరాలకు సాగునీరు అందించాలి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలో నీటిని పెద్ద మొత్తంలో నిల్వ చేసుకోవడానికి రిజర్వాయర్ నిర్మించాలి. లేదంటే చెరువుల సామర్థ్యం పెంచాలని సీఎం ఆదేశించారు.

పని భారం పెరిగినందున సాగునీటి వ్యవస్థ సమర్థ నిర్వహణ కోసం నీటి పారుదల శాఖను పునర్విభజించాలి. ఎక్కువ జోన్లను ఏర్పాటు చేసి, ప్రతీ జోన్ కు ఒక సీఈ ను  బాధ్యుడిగా నియమించాలి. సీఈ పరిధిలోనే ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు, చెరువులు ఉండాలి. గతంలో మాదిరిగా  భారీ, మధ్య తరహా, చిన్న తరహా, ఐడిసి అని నాలుగు విభాగాలుగా ఉండవద్దు. నీటి పారుదల శాఖ అంతే ఒకే విభాగంగా పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.