FbTelugu

ఆలయాలపై దాడి అమానుషం: చిన్న జీయర్ స్వామి

తిరుమ‌ల: శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారు శుక్ర‌వారం ఉద‌యం తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు.

ఆల‌యం వ‌ద్ద జీయర్ కు అద‌న‌పు ఈఓ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, ఆల‌య అర్చ‌కులు సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు. టీటీడీ ఛైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డి, ఈఓ డాక్ట‌ర్ కె.ఎస్‌.జవ‌హ‌ర్ రెడ్డి క‌లిసి తీర్థ‌ప్ర‌సాదాలు అంద‌జేశారు. ద‌ర్శ‌నానంత‌రం ఆల‌యం బయట జీయర్ స్వామి మీడియాతో మాట్లాడుతూ క‌రోనా మ‌హమ్మారిని ప్ర‌పంచానికి దూరం చేసే శ‌క్తి క‌లియుగ దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి మాత్ర‌మే ఉంద‌న్నారు. ఈ వ్యాధిని త‌ట్టుకోగ‌లిగే శ‌క్తిని ప్ర‌జ‌ల‌కు ఇవ్వాల‌ని, దీన్ని రూపుమాపే శ‌క్తి వైద్యులకు ఇవ్వాల‌ని స్వామివారిని ప్రార్థించిన‌ట్టు తెలిపారు.

ఆల‌యాలు మ‌న ధ‌ర్మానికి మూల‌ కేంద్రాల‌ని, అనేక వైదిక క‌ళ‌లు, లౌకిక క‌ళ‌లు వీటి ఆధారంగా మ‌నుగ‌డ ‌సాగిస్తున్నాయ‌ని వివ‌రించారు. ఆల‌యాల ద్వారా వేల మందికి ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా పోష‌ణ ల‌భిస్తోంద‌న్నారు. ఇంత‌టి విశిష్ట‌మైన ఆల‌యాల్లోని విగ్ర‌హాల‌పై ఇటీవ‌ల దుండ‌గులు దాడులు చేయ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు. రామ‌తీర్థంలోని ఆల‌యానికి జ‌రిగిన న‌ష్టంపై ఇటీవ‌ల ప‌రిశీలించాన‌ని చెప్పారు. అక్క‌డ ఇత‌ర వ‌స‌తుల‌తో ఆల‌యాన్ని అభివృద్ధి చేయాల‌ని వైవి.‌సుబ్బారెడ్డిని కోరామ‌న్నారు. ఆల‌యాలు బాగుంటే ప్ర‌జ‌ల్లో నైతిక ప్ర‌వృత్తి బాగుంటుంద‌ని, ధ‌ర్మ‌బ‌ద్ధంగా ఉంటార‌ని ఆయన వివ‌రించారు.

మార్చి నెల‌లో విశేష ఉత్స‌వాలు…

కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో నిత్య కల్యాణం పచ్చతోరణంగా ఏడాది పొడవునా ఉత్సవాలు జరుగుతుంటాయి. ఇందులో భాగంగా మార్చి నెలలో జరుగనున్న ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.

 

– మార్చి 9న స‌ర్వ ఏకాద‌శి.

– మార్చి 11న మ‌హాశివ‌రాత్రి.

– మార్చి 24 నుండి 28వ తేదీ వ‌రకు శ్రీ‌వారి వార్షిక తెప్పోత్స‌వాలు.

– మార్చి 24న స్మార్త‌ ఏకాద‌శి.

– మార్చి 25న వైష్ణ‌వ మాధ్వ ఏకాద‌శి.

– మార్చి 28న శ్రీ ల‌క్ష్మీ జ‌యంతి, శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి.

You might also like

Leave A Reply

Your email address will not be published.