FbTelugu

పల్లె ప్రగతి బాగుంది: కేసీఆర్

హైదరాబాద్: పల్లెసీమల రూపురేఖలను మారుస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమాలు ఇదే స్ఫూర్తితో ముందడుగు వేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా చేపట్టిన పనులు తెలంగాణ పల్లెలను దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా నిలుపుతున్నాయని అన్నారు.
ఇది రాష్ట్రానికి గర్వకారణమని ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమంపై మంగళవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పల్లె ప్రగతి ద్వారా నిర్దేశించుకున్న లక్ష్యాలు చాలావరకు పూర్తయ్యాయని, మిగిలిన కొద్దిపాటి గ్రామాల్లో కూడా పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయన కోరారు. గ్రామాల పరిస్థితి పల్లె ప్రగతికి ముందు, పల్లె ప్రగతికి తర్వాత అన్నట్లుగా ఉందని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పల్లె ప్రగతి పనులను సమీక్షించాలని అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పచ్చదనం – పరిశుభ్రత వెల్లివిరియాలని ప్రభుత్వం ఆశించిందన్నారు. ఈ లక్ష్యం వందకు వందశాతం నెరవేరుతున్నది. తెలంగాణ పల్లెలు పరిశుభ్ర, ఆరోగ్య ఆవాసాలుగా రూపాంతరం చెందాయన్నారు.

గ్రామ పంచాయతీలకు ఇపుడు నిధుల కొరత లేదని సీఎం తెలిపారు. విధులు నిర్వర్తించడానికి అవసరమైన అధికారాలను ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఇచ్చింది. గతంలో గ్రామ పంచాయతీల్లో మంచినీటి సరఫరా కోసం ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. మిషన్ భగీరథ కారణంగా గ్రామ పంచాయతీలకు ఆ తలనొప్పులు పోయాయి. మంచినీళ్ల కోసం ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది. నిధుల కొరత లేకపోవడంతో విద్యుత్ బిల్లులను కూడా ఎప్పటికప్పుడు చెల్లించగలుగుతున్నారని కేసీఆర్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.