విశాఖపట్నం: నిన్న రాత్రి విశాఖ ఫార్మాసిటీలో రాంకీ సీఈటీపీ సాల్వెంట్స్ లో సంభవించిన పేలుడుపై పరిశ్రమల శాఖ మంత్రి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగంతో ఫోన్ ద్వారా ప్రాథమిక సమాచారాన్ని అడిగి తెలుసుకుని మాట్లాడారు. ఈ అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టం లేకుండా చూడాలని పోలీసు యంత్రాంగానికి, అగ్నిమాపక అధికారులకు సూచించారు. ప్రతిక్షణం వైద్య, అగ్నిమాపక, పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వెంటనే క్షతగాత్రులకు అవసరమైన తగు వైద్య, సదుపాయాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ స్పందన:
ఫార్మాసిటీ అగ్ని ప్రమాదంపై తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్ వినయ్ చంద్ స్పందించారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఫైరింజన్లను సత్వరమే పంపినట్టు తెలిపారు. ఘటనా స్థలంలో అంబులెన్స్‌లను కూడా సిద్ధంగా ఉంచినట్టు తెలిపారు. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతుండటంతో అగ్నిమాపక వాహనాలు దగ్గరకు వెళ్లలేకపోతున్నాయని తెలిపారు. సమీపంలో అనేక కంపెనీలు ఉండటంతో అధికారులు, ప్రజలు తీవ్ర ఆందోళనకు గురౌతున్నట్టు తెలిపారు.