FbTelugu

గాడిన పడేనా?

కరోనాతో తీవ్రంగా నష్టపోయిన సంస్థలను ఆదుకునేందుకు కేంద్రం భారీ ప్యాకేజీని ప్రకటించింది. దీనిలో ప్రధానంగా పరిశ్రమలకు భారీగా రాయితీలు ప్రకటించే అవకాశాలున్నాయని అందరూ భావిస్తున్నారు.

నష్టాల్లో కూరుకుపోయిన సంస్థలను ఆదుకునేందుకు భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షించదగిందే. కానీ, ఇక్కడ అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాటిపై కేంద్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు. కరోనా నష్టాల పేరుతో ఇప్పటికే అనేక పరిశ్రమలతో పాటు సంస్థలు కార్మికులను, ఉద్యోగులను విధుల నుంచి తొలగించాయి. విధుల్లో ఉన్నవారికి సైతం జీతాల్లో భారీగా కోతలు విధించాయి. అయినా, తప్పనిసరి పరిస్థితుల్లో ఆ వచ్చిన కొద్దిపాటి జీతంతోనే సరిపెట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మరి, ఇప్పుడు నష్టాల్లో ఉన్న పరిశ్రమలు, సంస్థలను ఆదుకునేందుకు భారత ప్రభుత్వం 20లక్షల కోట్ల సాయాన్ని ప్రకటించింది.

వాటిని నేరుగా ఆయా పరిశ్రమలు, సంస్థలకు ఇస్తారు. ఆ సంస్థలు, పరిశ్రమలు ఈ డబ్బులను తమ ఖాతాల్లో వేసుకొని చేతులు దులుపుకుంటాయా.. తీసేసిన కార్మికులు, సిబ్బందికి మళ్లీ ఉద్యోగాలు కల్పిస్తాయా.. కోతకు గురైన జీతాలను మళ్లీ చెల్లిస్తాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని ఇచ్చిన ప్యాకేజీ కిందిస్థాయి వరకు చేరుతుందా.. కేవలం పరిశ్రమలు, సంస్థల జేబుల్లోకే వెళుతుందా.. అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి అనుమానాలు లేకుండా కేంద్రం స్పష్టమైన ప్రకటన చేస్తే బాగుండేదని అందరూ అభిప్రాయపడుతున్నారు.
పత్రికా రంగానికి ఎంత?
కరోనా కాలంలో పత్రికా రంగం తీవ్ర సంక్షభానికి గురైందని పత్రికారంగ యజమానులు వాపోతున్నారు. ఆ నష్టాలను తగ్గించుకునేందుకు దాదాపు అన్ని సంస్థలూ ఉద్యోగుల్లో సగానికి సగం మందిని ఇంటికి పంపాయి. ఉన్న వారికి కూడా 25 నుంచి 60శాతం దాకా జీతాల్లో కోతలు విధించాయి. ఈ నేపథ్యంలోనే తమను ఆదుకోవాలని పత్రికారంగ యజమానులు ప్రధానిని కలిసి మొరపెట్టుకున్నారు. ప్రకటనలు పెంచాలని, న్యూస్‌ప్రింట్‌పై సబ్సిడీ ఇవ్వాలని, వాటిపై దిగుమతి సుంకాలను ఎత్తివేయాలని తదితర డిమాండ్లను ప్రధాని ముందు ఉంచారు. అయితే, ఇప్పుడు కేంద్రం భారీ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీలో పత్రికా రంగానికి ఎంత కేటాయిస్తారో.. మళ్లీ పత్రికా రంగం మునుపటిలో పనిచేస్తుందో..లేదో. ఉద్యోగాలు పోయినవారిని మళ్లీ తీసుకుంటారో.. లేదోనన్న చర్చ దేశవ్యాప్తంగా జోరుగా జరుగుతోంది. ఈ అనుమానాలన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

You might also like