FbTelugu

చెప్పని హామీలు కూడా అమలు..: హరిచందన్

ఏపీ ఉభయసభల్లో గవర్నర్ ప్రసంగం

అమరావతి: ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్నదని, ప్రజలకు మేలు కలగేందుకు చెప్పని హామీలను కూడా అమలు చేస్తున్నదని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు.

ఇచ్చిన 129 హామీల్లో 77 హామీలను ఇప్పటికే నెరవేర్చామని గుర్తు చేశారు. మేనిఫెస్టోలో లేని 40 హామీలను నెరవేర్చామని, మరో 39 హామీలను పరిశీలిస్తున్నామని అన్నారు. ఈ ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

రాష్ట్రంలోని 3.98 కోట్ల మందికి వివిధ పథకాల ద్వారా లబ్ది పొందారని, అందుకు రూ. 42 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని హరిచందన్ వ్యాఖ్యానించారు. గత సంవత్సరంతో పోలిస్తే తలసరి ఆదాయం 12 శాతం పెరిగిందని, ఆరోగ్య శ్రీ పథకం కింద 6.25 లక్షల మందికి రూ. 1,200 కోట్లకు పైగా సాయం చేశామని అన్నారు. వైఎస్ఆర్ ఆసరా కోసం రూ. 1,534 కోట్లు,  కంటివెలుగు కోసం రూ. 53.85 కోట్లను కేటాయించామని తెలిపారు.

45 ఏళ్లు నిండిన మహిళలకు చేయూతనివ్వాలని తన ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందులో భాగంగా వచ్చే నాలుగేళ్లలో వారికి రూ. 75 వేల చొప్పున సాయం చేయనున్నామని గవర్నర్ వెల్లడించారు. రాజకీయ, ఆర్థిక రంగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను కల్పించామని ఆయన గుర్తు చేశారు. పారిశ్రామిక రంగంలో 5 శాతం వృద్ధి రేటును సాధించామని అన్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో 8 శాతం వృద్ధి నమోదైందని తెలిపారు.

2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందని బిశ్వభూషణ్ హరిచందన్ వ్యాఖ్యానించారు. వెలిగొండ ప్రాజెక్టు ఈ సంవత్సరమే పూర్తవుతుందని, అవుకు రెండో సొరంగాన్ని, సంగం బ్యారేజ్, వంశధార, నాగావళి నదుల అనుసంధానాన్ని పూర్తి చేయనున్నామని వెల్లడించారు.

కరోనా వైరస్ నియంత్రణను అరికట్టడంలో ఏపీ ముందు నిలిచిందని, వైరస్ పరీక్షలు నిర్వహించడంలో మిగతా రాష్ట్రాల కన్నా ముందు నిలిచిందని, ఇప్పటికే 5.50 లక్షలకు పైగా పరీక్షలు నిర్వహించినట్టు గవర్నర్ గుర్తు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.