FbTelugu

నువ్విక్కడుంటే.. నేనక్కడుంటా!

నువ్విక్కడుంటే.. నేనక్కడుంటా అన్నట్టుంది విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డిల పరిస్థితి. వీరిద్దరికీ అసలు పొసగడం లేదు. వికారాబాద్‌ జిల్లాలో మంత్రి అభివృద్ధి పనుల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రతిసారీ మహేందర్‌రెడ్డి, ఆయన సతీమణి, వికారాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డిలు ఆ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. రాష్ట్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సబిత ఆదివారం రెండోసారి వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల్లో పర్యటించారు. అయితే, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి దంపతులు స్థానికంగానే ఉన్నప్పటికీ మంత్రి కార్యక్రమాల్లో పాల్గొనలేదు. పైగా పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకే తాను మంత్రి కార్యక్రమానికి దూరంగా ఉన్నానని మహేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వాస్తవానికి సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డిలు సమీప బంధువులు. మహేందర్‌రెడ్డికి సబిత వరుసకు అత్త అవుతారు. అయినా, ఆ రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వారి మధ్య ఎందుకు ఇంత విభేదాలున్నాయన్న దానిపై కార్యకర్తల్లో జోరుగా చర్చ సాగుతోంది.

సబిత రాకతో మహేందర్‌రెడ్డికి చెక్‌

సబితా ఇంద్రారెడ్డి ఎప్పటినుంచో కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి హోంమంత్రిగా కూడా పనిచేశారు. రంగారెడ్డి జిల్లాలో ఆ కుటుంబానికి మంచి పేరుంది. క్యాడర్‌ కూడా పెద్ద ఎత్తునే ఉంది. 2018 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ గాలి వీచినా సబిత దానిని తట్టుకొని కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా మహేశ్వరం నిమోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆమె టీఆర్‌ఎస్‌లో చేరారు. పట్నం మహేందర్‌రెడ్డి మంత్రిగా పనిచేసుకుంటూనే 2018 ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే, కేసీఆర్‌ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఎమ్మెల్సీగా విజయం సాధించిన పట్నం ఇక, తనకు మళ్లీ మంత్రి పదవి రావడం ఖాయమనుకున్నాడు. కానీ, గులాబీ బాస్‌ ఆయనను కాదని కాంగ్రెస్‌ నుంచి వచ్చిన ప్రత్యర్థి సబితకు మంత్రి పదవి ఇచ్చారు. దీంతో మహేందర్‌రెడ్డి అధికారానికి దూరమయ్యారు. సబిత మంత్రి కావడంతో పార్టీ కార్యకర్తలంతా ఆమె వద్దకే వెళుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తన ప్రాభవం తగ్గి.. సబిత ప్రభావం పెరగడాన్ని మహేందర్‌రెడ్డి దంపతులు తట్టుకోలేక పోతున్నట్టు గులాబీ పార్టీ కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు. సబిత పెత్తనం ఇలాగే కొనసాగితే.. తన రాజకీయ భవిష్యత్‌ ఏమిటని పట్నం దంపతులు తమలో తాము మదనపడుతున్నట్టు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. అందుకే మంత్రితో కలిసి పనిచేస్తే ఇంకా తమ రాజకీయ భవిష్యత్‌కు పెద్ద దెబ్బ తగులుతుందన్న భావనతోనే వారు ఆమె కార్యక్రమాలను బహిష్కరిస్తున్నట్టు ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వారిద్దరి మధ్య మనస్పర్ధలు ఎప్పుడు తొలుగుతాయోనని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.

You might also like