FbTelugu

కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్తే !

మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌ సినిమా మీరు చూసే ఉంటారు. అది హిందీ సినిమా. దానినే తెలుగులో శంకర్‌దాదా ఎంబీబీఎస్‌గా తీశారు. ఆ సినిమాలో శంకర్‌ అనే హీరో (చిరంజీవి) రౌడీ. కానీ, ఓ ఆసుపత్రిని ఏర్పాటుచేసి అందులో చికిత్స చేస్తున్నట్టు నటిస్తాడు.

ఇప్పుడు హైదరాబాద్‌ నగరంలో జరిగిన సంఘటనను చూస్తే అదే సినిమా గుర్తుకు వస్తుంది. ఆ డాక్లరు చేసిన దారుణం చూస్తే ఇతడు కూడా శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ టైపేనా అన్న అనుమానం కూడా కలుగుతోంది. ఇంతకీ అతడు చేసిన దారుణం ఏంటంటే.. రంగారెడ్డి జిల్లా కడ్తాల మండల కేంద్రానికి చెందిన నార్లకంటి లాలమ్మ(43) గత కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. స్థానికంగా ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. అయితే ఆమనగల్లులోని ఓ ఆసుపత్రిలో చూపించగా కడుపులో కణితులు ఉన్నాయని హైదరాబాద్‌ తీసుకువెళ్లాలని చెబుతూ బాలానగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి రెఫర్‌ చేశారు.

ఈ మేరకు లాలమ్మకు గతేడాది ఫిబ్రవరిలో ఆపరేషన్‌ చేసి ఇంటికి పంపించారు. ఇటీవల లాలమ్మకు మళ్లీ కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు రెండు రోజుల క్రితం కర్మన్‌ఘాట్‌లోని అవేర్‌ గ్లోబల్‌ ఆసుపత్రిలో చేర్పించారు. కడుపులో ఇంకా కణితులు ఉన్నాయని ఆపరేషన్‌ చేయాలని అనగా.. కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో ఆసుపత్రి వర్గాలు ఆపరేషన్‌ చేశారు. అయితే ఆశ్చర్యకరంగా కడుపులో కణితులతో పాటు క్లాత్, ఆపరేషన్‌లో వినియోగించే పత్తి ఉండలు బైటపడ్డాయి. గతంలో ఎక్కడ ఆపరేషన్‌ చేయించారో వాళ్ల నిర్లక్ష్యమేనని అక్కడి ఆసుపత్రి వైద్యులు తేల్చి చెప్పారు. కుటుంబ సభ్యులు సదరు ఆసుపత్రి వద్దకు చేరుకుని నిలదీద్దామని వస్తే అది మూసివేశారు. దీనిపై బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా ఈ విషయంలో న్యాయం జరిగే వరకు పోరాడుతామని లాలమ్మ కుమారుడు శేఖర్‌ తెలిపారు.

You might also like