FbTelugu

హైదరాబాద్, రంగారెడ్డి టెన్త్ పరీక్షలు వాయిదా

మిగతా జిల్లాల్లో యాధావిధిగా పరీక్షలు

రెండు జిల్లాల విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షలకు అనుమతించాలి

విద్యార్థులు మరణిస్తే బాధ్యత ఎవరు తీసుకుంటారు

హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి మినహా మిగతా జిల్లాల్లో మాత్రమే పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు మధ్యంతర తీర్పునిచ్చింది. మిగతా జిల్లాల్లో సోమవారం నుంచి యధావిధిగా పరీక్షలు నిర్వహించుకోవడానికి అనుమతించింది.

కరోనా తీవ్రత, విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా పరిధిలో పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. పరీక్షలు జరుగుతున్న ప్రాంతాల్లో కరోనా తీవ్రత పెరిగితే వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పదో తరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలో వేర్వేరుగా పరీక్షలు నిర్వహించడం కష్టమని అడ్వొకేట్ జనరల్ బీఎస్.ప్రసాద్ హైకోర్టుకు విన్నవించారు. రెండు జిల్లాల విద్యార్థుల కోసం ప్రశ్నపత్రం మళ్లీ మళ్లీ తయారుచేయడం ఇబ్బంది అవుతుందన్నారు.

విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమా.. సాంకేతిక అంశాలు ముఖ్యమా అని హైకోర్టు ప్రశ్నించింది. విద్యార్థులు మరణిస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారని నిలదీసింది. సప్లిమెంటరీ ఉత్తీర్ణులను రెగ్యులర్‌గానే పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఏజీ తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షలకు మాత్రమే అనుమతించాలని కోర్టు సూచించింది

రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. పంజాబ్‌ తరహాలో పరీక్షలు లేకుండానే విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వాలని పిటిషనర్ వాదించారు. పరీక్షలు లేకుండా గ్రేడింగ్ ఇస్తే ఇబ్బందేంటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణను ఈ నెల 19 కు వాయిదా వేసింది.

You might also like