FbTelugu

పవన్‌ లేక్కేంటో!

పవన్‌కల్యాణ్‌ నటించిన గబ్బర్‌సింగ్‌ సినిమా మీరు చేసే ఉంటారు. అందులో ఓ డైలాగ్‌ బాగా ఫేమస్‌ అయింది. అదే.. నాకు కొంచెం తిక్కుంది.. కానీ, దానికో లెక్కుంది అని. అది ఇప్పుడు కేవలం సినిమా డైలాగే కాదు.. పవన్‌ ఇప్పుడు ఆ విధానాన్నే పార్టీ విధానాల్లో కూడా అదే ఫార్మూలాను అనుసరిస్తున్నారన్న వార్తలు బాగా ట్రోల్‌ అవుతున్నాయి. ఎన్నికలు వచ్చేసరికి బరిలో దిగుతున్నామని చెప్పడం.. తీరా అవి దగ్గరకు వచ్చే సరికి బరినుంచి తప్పుకోవడం మామూలు అయిందన్న విమర్శలకు దిగుతున్నారు.

సాధారణంగా పార్టీ పెట్టిన వారు ఎన్నికల్లో పాల్గొని అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ, పవన్‌ కల్యాణ్‌ మాత్రం జనసేన పార్టీని పెట్టినా ఎన్నికల్లో పాల్గొనడానికి ముందుకు రావడం లేదు. తాజాగా హైదరాబాద్‌ నగరపాలక సంస్థ ఎన్నికల్లో పోటీచేస్తామని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉంటుందని భావించారు. కానీ, బీజేపీ నేతలు జనసేన పార్టీని సంప్రదించకుండానే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. దీంతో జనసేన పరిస్థితి దారుణంగా మారింది. అయినా, పోటీచేసే అభ్యర్థుల జాబితాను కూడా తయారు చేశారు. మరికాసేపట్లో దానిని ప్రకటిస్తారని జనసేన కార్యకర్తలు కూడా భావించారు.

కానీ, బీజేపీ నేతల మాటలతో ఈ ఎన్నికల బరినుంచి పూర్తిగా తప్పుకుంటున్నామని, తమ పార్టీ ఎన్నికల్లో పోటీచేయడం లేదని ప్రకటించారు. దీంతో జనసేన కార్యకర్తలే కాదు.. మిగతా పార్టీలు, పవన్‌ అభిమానులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. వాస్తవానికి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పొత్తు గురించి బీజేపీ నాయకులు జనసేన పట్ల అవమానకరంగా ప్రవర్తించారన్న బాధ జనసైనికుల్లో ఉంది. ఆ పార్టీతో పొత్తు ఉందన్న విషయం తెలిసినా తమ గురించి పట్టించుకోకుండా, కనీసం తమ పార్టీ అధినేతను సంప్రదించకుండా ఏకంగా అన్ని స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించడమంటే ఇది జనసేనకు తీవ్ర అవమానకరమేనని భావిస్తున్నారు. అయినా, చివరికి బీజేపీ తమ పార్టీనే దారికి తీసుకొచ్చుకుంది. పవన్‌ కూడా వారి మాటలు విని పూర్తిగా బరినుంచి తప్పుకోవడంలో ఆంతర్యం ఏముందోనన్న చర్చ జోరుగా సాగుతోంది. ఓట్లు చీలకుండా బీజేపీకి సహకరించేలా ఈ ప్లాన్‌ వేశారా.. లేక ఎన్నికల్లో గెలవలేమనే భయంతోనే బరినుంచి తప్పుకున్నారా…? అన్న అనుమానాలు జనసైనికుల్లోనూ వ్యక్తమవుతున్నాయి. చివరగా పవన్‌ కల్యాణ్‌ సినిమా డైలాగ్‌ చెప్పినట్టుగా ఆయనకున్న తిక్కేంటో.. దానికున్న లేక్కేంటోనని భావిస్తున్నారు. ఆయన లెక్కేమో గానీ తమకు ఎన్నికల్లో పోటీచేసే భాగ్యం ఎప్పుడు కలుగుతుందోనని జనసేన కార్యకర్తలు, నాయకులు వాపోతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.