FbTelugu

హైదరాబాద్‌ కోలుకునేనా..?

కరోనా చేస్తున్న నష్టం అంతా ఇంతా కాదు. లక్షలమందిని పొట్టన పెట్టుకుంటున్న ఈ వైరస్‌ హైదరాబాద్‌ నగరాన్ని కూడా అతలాకుతలం చేస్తోంది.

తెలంగాణ జిల్లాల్లో ఈ ప్రభావం భారీగా తగ్గినా హైదరాబాద్‌ నగరంలో మాత్రం నానాటికీ తన ప్రతాపాన్ని పెంచుతోంది. లాక్‌డౌన్‌ సడలింపుతో ఈ పరిస్థితి మరింత పెరిగింది. రోజుకు కనీసం 30 నుంచి 50 పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నా పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పూ రావడం లేదు.

అపార్ట్‌మెంట్లకు అపార్ట్‌మెంట్లే వైరస్‌ బారిన పడుతున్నాయి. దీనికితోడు ఈ వైరస్‌ సోకిన వారిలో దుకాణాలు నిర్వహించే వ్యాపారులు ఎక్కువగా ఉండడం కూడా ఈ సంఖ్య మరింత పెరగడానికి కారణమవుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దుకాణాల్లో ప్రతిరోజూ అనేకమంది సరుకులు కొనుక్కు వెళతారు. అలాంటప్పుడు ఓ దుకాణదారుడికి పాజిటివ్‌గా తేలితే అతని వద్ద సరుకులు తీసుకెళ్లిన వారిని గుర్తించడం చాలా కష్టమవుతోంది.

వారిని గుర్తించేలోగా మరికొంతమందికి వారిద్వారా వైరస్‌ సోకుతుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. దీనికితోడు ఇటీవల ప్రభుత్వం లాక్‌డౌన్‌కు సడలింపులు ఇస్తూ వస్తోంది. దీంతో బయట తిరిగేవారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీనివల్ల కూడా ఎక్కువ నష్టం జరుగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కొంప ముంచుతున్న మద్యం దుకాణాలు
ఇటీవల కాలంలో మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వడం కూడా కొంప ముంచుతుందని నగరవాసులు భావిస్తున్నారు. మద్యం ప్రియులు చాలాకాలం నుంచి మందుకు దూరమయ్యారు. ఇటీవల వాటిని తెరవడంతో ఇబ్బడిముబ్బడిగా మందు బాటిళ్లు తెచ్చుకున్నారు. దీంతో ఇంట్లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా దావత్‌లు చేయడం ప్రారంభించారు. ఇలా ఎక్కువమంది కలిసి ఒకే దగ్గర తిని, తాగడం వల్ల కూడా వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

ఇటీవల హైదరాబాద్‌ నగరంలో బయటపడుతున్న కేసులను పరిశీలిస్తే ఇది వాస్తవమేనన్న విషయం కూడా వెల్లడవుతోంది. ఇటీవల కాలంలో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ శాతం పుట్టిన రోజు వేడుకలు చేసుకున్న వారివేనన్న విషయాన్ని ప్రభుత్వమే వివరించింది. అంటే ఇప్పటికీ మద్యం అందుబాటులో లేకుంటే ఈ దావత్‌లు జరిగేవి కావు. వైరస్‌ సోకేది కాదు కదా అని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ, ఇప్పటి పరిస్థితి చూస్తే మాత్రం పాలకులు చెబుతున్నట్టు కరోనా తగ్గే పరిస్థితి కనిపించడం లేదని.. దాంతో పాటే జీవించాలి.. దాంతోపాటే మరణించాల్సిన రోజులు వచ్చాయని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

You might also like