అమరావతి: ఏపీ వైపు తుఫాన్ ముప్పు దూసుకొస్తోంది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలోని అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది.
ఇది రానున్న 24 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా.. ఆ తర్వాత 24 గంటల్లో తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ తుఫాన్‌కు నివర్ అని పేరు పెట్టారు. ఇది వాయువ్య దిశగా ప్రయాణించి.. ఈనెల 25న మధ్యాహ్నం పుదుచ్చేరి-మహాబలిపురం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొన్నది.
ఈ ప్రభావంతో ఆదివారం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిశాయి. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో అనేకచోట్ల ఉరుములతో వర్షాలు పడ్డాయి.
ఇక 25, 26న భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. చిత్తూరు, నెల్లూరు నుంచి గుంటూరు వరకు వర్షాలు పడనున్నాయి. తీరంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు.
మత్స్యకారులు ఈనెల 25 వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని.. ఎవరైనా వెళ్లుంటే వెంటనే వెనక్కి వచ్చేయాలని ఆదేశించారు.
ఓవైపు నివర్ తుఫాన్ భయపెడుతుంటే.. ఇటు అరేబియా సముద్రంలోని గతి తుఫాన్ మనవైపు కదులుతోంది. ఒకవేళ భారత్‌వైపు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే ఆందోళన నెలకొంది.