FbTelugu

శ్రీశైల క్షేత్రంలో కోట్లలో గోల్ మాల్

అవినీతి సొమ్ము రికవరీ చేస్తాం: ఈఓ రామారావు

శ్రీశైలం: దేశంలోనే ప్రముఖ శైవ క్షేత్రం. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి అయిన శ్రీశైల క్షేత్రంలో అవినీతి రాజ్యమేలుతోంది. సిబ్బంది చేతివాటం ప్రదర్శించి కోట్లాది రూపాయలు మింగేస్తున్నారు.

శీఘ్ర దర్శనం కౌంటర్ లో సుమారు రూ.1.80 కోట్లు మాయమయ్యాయి. కొంత మంది అక్రమార్కులు ఈ సొమ్మును కాజేశారు. సర్వజన దర్శనంతో పాటు శీఘ్ర దర్శనం విధానం అమల్లో ఉంది. శీఘ్ర దర్శనం కోసం రూ.150 చెల్లించి టిక్కెట్ కొనుగోలు చేస్తారు. అదే విధంగా రూ.1500 అభిషేకం టికెట్లలో రూ.50 లక్షలు మాయమయ్యాయి. డొనేషన్స్ కౌంటర్లలో రూ.1 కోటి వరకు అవినీతి జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. వసతి సదుపాయం కౌంటర్లో మరో రూ. 50 లక్షల అవినీతి జరిగిందంటున్నారు.

టోల్ గేట్, పెట్రోల్ బంకుల నిర్వహణలో మరో రూ.40 లక్షలు, 500 రూపాయల టిక్కెట్లు, కంకణాలు, మహా మంగళహారతి టికెట్లలో మరో రూ.50 లక్షలు దుర్వినియోగం అయిందంటున్నారు. అవినీతికి తెగబడిన అక్రమార్కులు ఏకంగా సాఫ్ట్‌వేర్‌ నే మార్చేసి తమ పని గుట్టు చప్పుడు కాకుండా పూర్తి చేశారు. ఈ అవినీతి మరక తమ మీదికి రాకుండా సదరు అక్రమార్కులు టికెట్ కౌంటర్లలో కాంట్రాక్టు ఉద్యోగులను నియమించారంటే ఎంత అప్రమత్తంగా ఉన్నారో ఊహించుకోవచ్చు.

తీగలాగితే డొంక కదిలిన చందంగా కోట్ల రూపాయల అక్రమాలు బట్టబయలు అవుతున్నాయి. అయితే.. ఒక్కొక్కటిగా అవినీతి బయట పడడంతో ఒకరిపై ఒకరు ఆలయ ఈఓ రామారావుకు పిటిషన్లు పెట్టుకున్నారు. శ్రీశైల క్షేత్రంలో భారీ ఎత్తున అవినీతి జరిగింది వాస్తవమేనని రామారావు తెలిపారు. అయితే ఎంత మొత్తం జరిగింది, ఏ ఏ విభాగాల్లో చేశారనే దానిపై వివరాలు రావాల్సి ఉందన్నారు. అవినీతి సొమ్మును రికవరీ చేస్తామని, దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపిస్తానని ఆయన చెప్పారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.