FbTelugu

వలస కూలీకి ఎంత కష్టం!

ఇప్పుడు వలస కూలీలంటేనే జనం భయపడే పరిస్థితులు వచ్చాయి. చేసేందుకు పనులు లేక పొట్టచేత పట్టుచేత పట్టుకొని ఎక్కడెక్కడకో వెళ్లారు. జానెడు పొట్టకోసం పడరాని పాట్లు పడ్డారు.

కుటుంబాలకు దూరంగా ఎక్కడో కష్టాల పాలయ్యారు. ఒక పూట తిని.. మరోపూట పస్తులుండి కుటుంబాలను పోషించుకున్నారు. కానీ, కరోనా వారి జీవితాల్లో చిచ్చురేపింది. లాక్‌డౌన్‌ ప్రభావంతో దేశవ్యాప్తంగా పనులు ఆగిపోయాయి. ఉపాధి దొరికే మార్గం లేక.. తినడానికి తిండిలేక బతుకు జీవుడా అంటూ ఇంటిదారి పట్టారు. ఇంటికి వద్దామంటే రవాణా సౌకర్యాలు లేవు.

సర్కారు రానివ్వడం లేదు. అయినా, ప్రాణాలకు తెగించి కాలినడకన వందల కిలోమీటర్లు నడిచి ఇంటికి చేరుకున్నారు. తీరా ఇంటికి చేరితే గ్రామాల్లోకి రానివ్వడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో, ఊరికి దూరంగా క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. ఊరుకు చేరినా కుటుంబ సభ్యులను చూసే అవకాశం కూడా లేక వారు ఆవేదన చెందుతున్నారు. ఇటీవల కాలంలో వలస కార్మికుల్లో పాజిటివ్‌ లక్షణాలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో ఒక్క హైదరాబాద్‌ నగరం మినహా ఏ జిల్లాలోనూ కొత్తగా కరోనా కేసులు నమోదు కావడం లేదు.

ఈ పరిస్థితుల్లో సొంత ఊళ్లకు వస్తున్న వలస కార్మికులకు మాత్రం ఈ కేసులు ఉన్నట్టు పరీక్షల్లో తేలుతుంది. దీంతో ప్రభుత్వం, అధికారులు వీరిని నేరుగా ఇంటికి వెళ్లనీయకుండా క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. వీరిలో చాలామందికి పాజిటివ్‌గా తేలుతున్నాయి. దీంతో గ్రామస్తులు కూడా వలస కార్మికులను ఊళ్లలోకి అనుమతించడం లేదు. దీంతో వారు వందల కిలోమీటర్లు నడిచి వచ్చినా ఇంటికి చేరలేకపోతున్నామే అంటూ ఆందోళన చెందుతున్నారు. అయితే, ఇటీవల కాలంలో రాష్ట్ర సరిహద్దుల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌తో జిల్లాలోకి వలస కూలీలను అనుమతిస్తున్నారు. ప్రభుత్వం వీరికి ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించడం లేదు. థర్మల్‌ స్క్రీనింగ్‌ జరిపి కరోనా లక్షణాలు లేవని సర్టిఫికెట్‌ ఇచ్చి పంపుతున్నారు. వీరికి పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహించి పంపితే బాగుంటుందని.. పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల వారు ఇంటికి వచ్చిన తర్వాత లక్షణాలు కనిపిస్తే అప్పుడు గ్రామానికంతటికీ కరోనా చుట్టుకునే ప్రమాదముందని జనం భయపడుతున్నారు.

You might also like