హైదరాబాద్: కృష్ణా పరీవాహక జలాల పరిరక్షణలో తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ద్వారా అధిక జలాలను తీసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నా తెలంగాణ సర్కారు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేతలు అనేకసార్లు విమర్శలకు దిగారు.
అసలు జగన్, కేసీఆర్ కలిసే కృష్ణా జలాలను ఏపీకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారని కూడా ఆరోపించారు. అయితే, కృష్ణా జలాల వివాదంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని, వెంటనే తెలంగాణ సర్కారు కృష్ణా పరీవాహక జలాలను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సోమవారం తెలంగాణలోని కృష్ణా నది జలాల వద్ద దీక్షలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు ఈ దీక్షలు జరగకుండా అడ్డుకుంటున్నారు.
సోమవారం తెల్లవారుజామునే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల ఇళ్లకు వెళ్లి వారిని హౌస్ అరెస్టు చేస్తున్నట్టు కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. తమ ఇళ్ల వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. హైదరాబాద్లో ఉన్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఇప్పటికే హౌస్ అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, నాగం జనార్ధన్ రెడ్డిని ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు.