FbTelugu

ఆయన వ్యాఖ్యలు ఇందుకేనా..?

ఏపీలో ఇప్పుడు హాట్‌టాపిక్‌ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ. దానిపై బీజేపీ మినహా అన్ని పార్టీలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఆ ఫ్యాక్టరీ ఏపీలో ఉండడంతో అక్కడి ప్రజలు, పార్టీలు పెద్ద ఎత్తున దానిని కాపాడుకునేందుకు నిరసన బాట పట్టారు. ఇదంతా ఒక ఎల్తైతే తెలంగాణ మంత్రి, సీఎం కేసీఆర్‌ తనయుడు కల్లకుంట్ల తారక రామారావు విశాఖ ఉక్కుపై స్పందించారు. ఆ ఉద్యమానికి తాను సహకరిస్తానని, అవసరమైతే విశాఖకు కూడా వస్తానని వ్యాఖ్యానించారు. ఇదే ఇప్పుడు అర్ధం కాని సమస్యగా మారింది. సమస్య ఎక్కడ ఉన్నా ఎక్కడి వారైనా ఆ ఆందోళనలో పాల్గొనడం తప్పేమీ కాదు.. అది కొత్త తరహా కూడా కాదు. కానీ, కేటీఆర్‌ ఇప్పుడు చాలా బీజీగా ఉన్నారు. తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రెండింటిలోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఎదురీదుతున్నారు. వారిని గెలిపించేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులన్నీ కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నాయి. ఇక కేటీఆర్‌ లాంటి నేతలు నిద్రాహారాలు మాని ఈ ఎన్నికలపైనే దృష్టి పెట్టారు. ఇంత బిజీగా ఉన్న కేటీఆర్‌ ఇప్పుడు విశాఖ ఉక్కును ఎందుకు ముందేసుకున్నారో తెలియక తెలంగాణ ప్రజలు బుర్రలు గోక్కుంటున్నారు. అయితే, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు, తెలంగాణలోని ఎమ్మెల్సీ ఎన్నికలకు లింకు ఉండడం వల్లే కేటీఆర్‌ ఉక్కు పోరాటానికి మద్దతిచ్చారని, ఒకడుగు ముందుకు వేసి అవసరమైతే అక్కడకు వచ్చి ఉద్యమంలో పాల్గొంటానని చెప్పారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విశాఖ ఉక్కును ఆంధ్రా ప్రజలు దైవంగా కొలుస్తారు. ఎంతోకాలం పోరాడి సాధించుకకున్న ఫ్యాక్టరీ అది. దానివల్ల నేడు లక్షలాది మంది దానిపై బతుకుతున్నారు. దానిని ప్రైవేటుపరం కానీయకుండా కాపాడుకోవడం వారికి చాలా ముఖ్యం. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఉద్యమానికి మద్దతుగా నిలిస్తే తెలంగాణలో ఉన్న సెటిలర్‌ పట్టభద్రుల ఓట్లు కట్టకట్టుకొని టీఆర్‌ఎస్‌కు పడతాయన్న ఆలోచనతోనే కేటీఆర్‌ ఇలా వ్యాఖ్యలు చేశారన్న ప్రచారం సాగుతోంది. సో, విశాఖ ఉక్కు ఉద్యమానికి కేటీఆర్‌ మద్దతు పలకడం వెనుక ఇంత స్టోరీ ఉందన్న మాట. మరి కేటీఆర్‌ వ్యాఖ్యలు టీఆర్‌ఎస్‌కు ఎంతవరకు ఉపయోగపడతాయో చూడాల్సిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.