FbTelugu

హాస్పిటల్ వేధింపులు… యువకుడి బలవన్మరణం

హైదరాబాద్: ప్రైవేటు హాస్పిటళ్ల ధనదాహం కారణంగా చికిత్స పొందుతూ పలువురు మృతి చెందుతుండగా, ఫీజుల భారం భరించలేక సంతానం బలవన్మరణం చెందుతున్నారు.

కరోనా పాజిటివ్ తో తల్లి చనిపోవడం, బకాయి డబ్బులు ఇస్తేనే మృతదేహం ఇస్తామని హాస్పిటల్ యాజమాన్యం పేచి పెట్టడంతో మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మైలార్ దేవుపల్లి పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మధుబన్ కాలనీలో రుక్మిణి కుటుంబం నివసిస్తున్నది. కరోనా పాజిటివ్ రావడంతో గచ్చిబౌలి లోని ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందతూ ప్రాణాలు విడిచింది. అప్పటికే చికిత్స కోసం రూ.10 చెల్లించారు. మరో రూ.10 లక్షలు చెల్లిస్తే కాని మృతదేహం ఇవ్వలేమంటూ హాస్పిటల్ యజమాన్యం కుమారుడు శ్రీహరి (22)కు స్పష్టం చేసింది. తండ్రి కూడా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నాడు. వేదన భరించలేని శ్రీహరి సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మైలార్ దేవుపల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహం కోసం గాలిస్తున్నారు.

నగరంలోని ప్రతి ప్రైవేటు హాస్పిటల్ లో ఇలాంటి గొడవలే జరుగుతున్నాయి. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడం మూలాంగానే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రైవేటు హాస్పిటళ్లలో రాజకీయ నాయకుల పెట్టుబడులు ఉండడంతోనే చర్యలకు వెనకంజ వేస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ బలం, ఆర్థిక బలం లేని ఒకటి రెండు హాస్పిటళ్లపై చర్యలు తీసుకుని వదిలేస్తున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.