FbTelugu

అయ్యో రామక్క..

Hmm-Ramakka

చింతలేని చిన్న కుటుంబం వారిది. భార్య రామలక్ష్మి, భర్త వెంకటేశం.. వారి ముద్దుల కూతురు చంద్రకళ. ఇదీ వారి చక్కనైన కుటుంబం. పేద కుటుంబమైనా భార్య, భర్త ఇద్దరూ కష్టించి పనిచేసే వారే. కూలి పనులే వారికి జీవనాధారం. అయినా, ఒక్కగానొక్క కూతురును మంచి చదువు చదివించి ఉన్నతంగా మార్చాలన్నది వారి కోరిక. అందుకోసం రేవంబవళ్లు కష్టపడ్డారు. ఆ పాపను చదివిస్తున్నారు. తల్లిదండ్రుల కలలను నిజం చేస్తూ ఆ అమ్మాయి కూడా బాగా చదువుకుంటోంది. ఇంటర్‌ వరకూ మంచి మార్కులు తెచ్చుకొని క్లాసులో ఎప్పుడూ ఫస్ట్‌ వచ్చేది. ఆ తల్లిదండ్రులు కూడా రేయింబవళ్లు కష్టించి వచ్చిన వాటిలో కొంత దాచుకొని ఎకరం పొలం కొనుక్కున్నారు. దానిని ఎంతో ప్రేమగా చూసుకునే భార్య రామలక్ష్మి పేరున పెట్టాడు. అంతా సాఫీగా సాగుతున్న ఆ కుటుంబంలో మద్యం మహమ్మారి ప్రవేశించింది.

కూలి పనులకు వేళ్లే మేస్త్రీలకు రైతులు మద్యం ఇవ్వడం గ్రామాల్లో పరిపాటి. ఇదే సంప్రదాయం వారి ఊళ్లోనూ కొనసాగుతోంది. అయితే, ముందుగా వెంకటేశానికి మద్యం అలవాటు లేదు. అప్పుడు తన భాగానికి వచ్చిన మద్యాన్ని బంధువులకో, స్నేహితులకో ఇచ్చేవాడు. కొన్నాళ్లకు అతడి మదిలో ఓ ఆలోచన వచ్చింది. మద్యాన్ని ఎవరికో ఎందుకివ్వాలి.. తానే తాగితే పోలా అనుకున్నాడు. అనుకుందే ఆలస్యం వెంటనే మద్యం తాగడం మొదలుపెట్టాడు. భార్య రామలక్ష్మి ఎంత చెప్పినా వినలేదు. అలా మద్యానికి అలవాటు పడిన వెంకటేశం చివరకు దానికి బానిసగా మారాడు. రోజూ తాగి రావడం భార్యను చితకబాదడం ప్రారంభమైంది. దీంతో సంతోషంగా సాగుతున్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా అలజడి రేగింది. వెంకటేశం పనులకు వెళ్లడం మానేశాడు. భార్య తెచ్చిన కూలి డబ్బులను లాక్కొని మద్యం తాగేవాడు. చివరకు ఊళ్లో రూ.లక్షల్లో అప్పులు చేశాడు. అప్పులవాళ్లు ఇంటికి రావడం, ఘర్షణకు దిగడం నిత్యకృత్యంగా మారింది. ఈ పరిస్థితుల్లో కుటుంబం గడవడం కూడా కష్టమైంది.

దీంతో రామలక్ష్మి తన కూతురు చంద్రకళ చదువు మాన్పించి తనతో పాటు కూలి పనులకు తీసుకెళ్లి కుటుంబాన్ని ఆదుకుంటోంది. ఒక రోజు వారింటిలో నుంచి ఏడుపులు.. పెడబొబ్బలు వినిపించసాగాయి. భార్య రామలక్ష్మిని జుట్టుపట్టుకొని ఊడ్చుకొంటూ బజారులోకి తీసుకొచ్చి గొడ్డును బాదినట్టు బాదుతున్నాడు వెంకటేశం. ఇంత జరుగుతున్నా చుట్టుపక్కల వాళ్లు ఎవరూ పట్టించుకోవడం లేదు. దీనిలో ఎవరైనా జోక్యం చేసుకుంటే వాళ్లను కూడా ఇష్టమొచ్చినట్టు తిట్టడం.. వారిపై దాడికి దిగడం వెంకటేశానికి అలవాటు. దీంతో భార్యను కొడుతున్నా అతడిని వారించడానికి ఎవరూ సాహసం చేయలేదు. మద్యానికి అప్పులు ఎక్కువ కావడంతో వాటిని తీర్చడానికి.. ఇంకా తాగుడుకు కావాల్సిన డబ్బుల కోసం ఉన్న ఎకరం అమ్ముదాం.. సంతకం పెట్టాలని భార్యను కొడుతున్నాడు. ‘వద్దు మావా.. నా మాట విను. పెళ్లీడుకొచ్చిన పిల్ల ఉంది. ఆ పొలం ఇచ్చి దానిని ఓ మంచి అయ్య చేతిలో పెడదాం’. అని రామలక్ష్మి మొత్తుకుంటోంది. అయినా, అతనిలో మార్పు రాలేదు. పైగా విపరీతంగా బాదుతున్నాడు. చివరకు బలవంతంగా కాగితాలపై ఆమె వేలిముద్రలు వేయించుకొని పొలం అమ్మేశాడు. ఆ డబ్బులు రావడం తోనే ఇంటికి రావడం మానేశాడు. ఫుల్లుగా తాగి ఎక్కడెక్కడో తిరిగేవాడు. దీంతో కుటుంబం గడవడం కష్టంగా మారడంతో పాటు కూతురు పెళ్లి చేయడం ఎలాగా అన్న బెంగతో రామలక్ష్మి ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది.

ఆ ఆవేదనతో ఒకరోజు రామలక్ష్మి, ఆమె కూతురు చంద్రకళతో కలిసి విషం తాగి మరణించారు. అయినా, భర్త రాలేదు. చాన్నాళ్ల తర్వాతఇంటికి చేరుకున్నాడు వెంకటేశం. అప్పటికే భార్య, కూతురు చనిపోయి ఇల్లు పడావు పడి ఉంది. వెంకటేశం మద్యం విపరీతంగా తాగడంతో అతడి కాలేయం కూడా బాగా దెబ్బతిన్నది. అనారోగ్యం పాలయిన అతడిని పట్టించుకునేవారు లేరు. కనీసం తిండి పెట్టేవారు కూడా లేరు. చివరకు ఆ ఇంట్లోనే తిండి తిప్పలు లేకుండా మంచంపై నుంచి లేవలేని స్థితికి చేరుకున్నాడు. చివరకు అతడు కూడా మరణించాడు. అలా మద్యం మహమ్మారి ఒక కుటుంబం ఉసురు తీసుకొంది.

You might also like