FbTelugu

ఆర్టీసీ ఎం.డి పై హైకోర్టు సీరియస్

High-Court-Serious-on-RTC-MD

హైదరాబాద్: కోర్టులకు నివేదిక సమర్పించే సమయంలో పూర్తి వివరాలు కాకుండా సగం సగం వివరాలు పొందపర్చడం పై ఆర్టీసీ ఇన్ ఛార్జీ ఎం.డి సునీల్ శర్మ పై హైకోర్టు మండిపడింది. ఆర్టీసీ యజమాన్యం అందచేసిన రిపోర్ట్ ఫై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆర్టీసీ అధికారులు తప్పుడు సమాచారం కోర్టుకు ఇస్తున్నారని హైకోర్టు పేర్కొంది. బస్సుల కొనుగోలు కోసం కేటాయించిన రుణాన్ని రాయితీల బకాయిల చెల్లింపు గా నివేదికలో ఎలా పేర్కొంటారని హైకోర్టు ప్రశ్నించింది. రాయితీల బకాయిలు డీజిల్, జీతాల చెల్లింపు ఇతర అవసరాల కోసం వాడామని ఆర్టీసీ యజమాన్యం చెప్పింది. జిహెచ్ఎంసీ ఆర్టీసీకి డబ్బులు చెల్లించాలా లేదా అనేది తేల్చాలని హైకోర్టు స్పష్టం చేసింది. 2018 -19 సంవత్సరానికి జీహెచ్ఎంసీ నుండి ఆర్టీసీ కి రావాల్సిన నిధులు గురించి ఆర్టీసీకి తెలియజేశారా అని సునీల్ శర్మ ను ప్రశ్నించింది. సమాధానం చెప్పలేక తడబడ్డారు. ఆర్టీసీ ఎండి సునిల్ శర్మ సమర్పించిన నివేదిక అంతా తప్పుడు లెక్కలతో ఉందని ఆర్టీసీ జేఏసీ తరఫు న్యాయవాది దేశాయి ప్రకాష్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు ఆర్టీసీ సమ్మె పై కేసును నవంబర్ 7వ తేదీకి వాయిదా వేసింది.

హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీ తరపున ఇన్ ఛార్జీ ఎం.డి సునీల్ శర్మ, ఈడీ టీవీ. రావు, ఆర్థిక సలహాదారు రమేష్ హాజరయ్యారు. సంస్థ ఆర్ధిక స్థితిగతులపై ఆర్టీసీ యాజమాన్యం అఫిడవిట్ దాఖలు చేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం నుంచి రాయితీల సొమ్ము రూ.644.51 కోట్లు రావాల్సి ఉండగా, మొత్తం సొమ్మును ప్రభుత్వం విడుదల చేసింది. హైదరాబాద్‌లో బస్సులు నడుపుతున్నందుకు రూ.1786.06 కోట్లు చెల్లించాలని జీహెచ్‌ఎంసీకి ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది. 2015-16, 2016-17లో కలిపి రెండేళ్లలో జీహెచ్‌ఎంసీ 336.40 కోట్లు విడుదల చేసింది. మిగతా సొమ్ము చెల్లించే స్థోమత లేదని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. జీహెచ్‌ఎంసీ చట్టం, సెక్షన్‌ 112(30) ప్రకారం నగరంలో బస్సులు నడిపినందుకు వచ్చే నష్టాలను భర్తీ చేయడానికి జీహెచ్‌ఎంసీ అంగీకరించలేదు. అందువల్ల జీహెచ్‌ఎంసీ నుంచి రావాల్సినవి బకాయిలుగా పరిగణించరాదు. 2017 లో జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి బాగోకపోవచ్చు.. ఇప్పుడు బాగానే ఉందని చెప్పింది. 2016 -17 సంత్సరానికి జీహెచ్ఎంసీ నుండి ఆర్టీసీ కి రూ.246 కోట్లు చెల్లించాల్సి ఉంది …కానీ అప్పుడు జీహచ్ఎంసీ దగ్గర నిధులు లేవని ప్రభుత్వానికి తెలిపింది. ఇప్పుడు కూడా జీహెచ్ఎంసీ దగ్గర నిధులు లేవా అని ప్రశ్నించింది.

ఆర్టీసీలో నిర్వహణ, డీజిల్‌ భారం ఎక్కువగా ఉంటోంది. నిర్వహణ వ్యయం వల్లే నష్టం వాటిల్లుతోంది. ప్రభుత్వ సాయం అందుతున్నప్పటికీ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందని యాజమాన్యం తెలియచేసింది

You might also like