FbTelugu

వీకెండ్ లాక్ డౌన్ పరిశీలించాలి: హైకోర్టు

హైదరాబాద్: రాష్ట్రంలో వారాంతపు లాక్‌డౌన్‌ లేదా కర్ఫ్యూ వేళల పొడిగింపును పరిశీలించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని సూచించింది. పెరుగుతున్న కేసులు, మరణాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు వైద్య శాఖ ను ఆదేశించింది.
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగ్గా, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ రావు, డిజీపి ఎం.మహేందర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ నెల 8కి వీలైనంత ముందే నిర్ణయం తీసుకోవాలని, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స, ఔషధాల గరిష్ఠ ధరలు ప్రభుత్వం నిర్ణయించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సపై తాజా మార్గదర్శకాలు విడుదల చేయాలి. కరోనా పరీక్షలు మళ్లీ తగ్గించడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రోజుకు కనీసం ఒక లక్ష కరోనా పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. సంచార కేంద్రాల ద్వారా ఎన్ని పరీక్షలు చేశారో చెప్పాలని సూచించింది. జిహెచ్‌ఎంసి లో టోల్‌ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. ఇదే విధంగా వారంలోగా అన్ని జిల్లాల్లో టోల్‌ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. పేరంబుదురు నుంచి ఆక్సిజన్‌ రాకుండా తమిళనాడు ప్రభుత్వం అడ్డుకుంటోందని శ్రీనివాస్ రావు తెలపగా, తమిళనాడు నుంచి ఆగిన ఆక్సిజన్ వచ్చేలా చూడాలని కేంద్రాన్ని సూచించింది. తక్షణమే చర్యలు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి తెలపాలని పేర్కొంది. రెండ్రోజుల్లో కరోనాపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని, నిపుణుల కమిటీ సమావేశాల వివరాలు సమర్పించాలని హైకోర్టు వైద్య శాఖకు స్పష్టం చేసింది.
రాష్ట్రంలో శ్మశానవాటికలు, సదుపాయాల వివరాలు తెలపాలని, శుభకార్యాల్లో 200 మంది, అంత్యక్రియల్లో 50 మందికి మించొద్దని, వివాహాలు, అంత్యక్రియల్లో ఆంక్షలపై 24 గంటల్లో జిఓ ఇవ్వాలని ఆదేశించింది. కరోనా నిబంధనల పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని డిజిపి ఎం.మహేందర్ రెడ్డి తెలిపారు.

భౌతికదూరం పాటించని సంస్థలపైనే కేసులు పెడుతున్నామని, భౌతికదూరం పాటించని వ్యక్తులపై కేసులు నమోదు చేయడం లేదని వివరించారు. ఔషధాల అక్రమ విక్రయాలకు సంబంధించి 39 కేసులు నమోదు చేశామని చెప్పగా, ఔషధాల అక్రమ విక్రయాలపై మరింత కఠినంగా వ్యవహరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఆస్పత్రుల వద్ద పోలీసు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, మాస్కులు ధరించనివారి వాహనాల జప్తును పరిశీలించాలని హైకోర్టు డిజిపి ని ఆదేశించింది. ఫంక్షన్‌ హాళ్లు, పార్కులు, మైదానాల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలి. ఆర్టీపిసిఆర్‌ ఫలితాలు 24 గంటల్లో వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఏపిలో కొత్త వైరస్‌ వేరియంట్‌పై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఏపి నుంచి రాకపోకలకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణ ఈ నెల 13కి వాయిదా వేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.