FbTelugu

థియేటర్లు, పబ్బులపై ఎందుకంత ప్రేమ: హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తుండగా… సినిమా థియేటర్లు, బార్లు, పబ్బులపై ఎందుకంత ప్రేమ చూపిస్తున్నారని, ఆంక్షలు ఎందుకు విధించడం లేదో తెలపాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ, పరీక్షలు, నియంత్రణా చర్యలపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. కచ్చితత్వం కోసం ఆర్టిపిసిఆర్ పరీక్షలు ఎక్కువ శాతం నిర్వహించాలని గతంలో చెప్పామని, అయినా అమలు చేయడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ర్యాపిడ్ టెస్టులు 90 శాతం చేస్తూ, ఆర్టిపిసిఆర్ పరీక్షలు మాత్రం 10 శాతమే చేస్తున్నారంటూ మందలించింది. ఆర్టిపిసిఆర్ టెస్టులు నెమ్మదిగా పెంచుతున్నామని అడ్వకేట్ జనరల్ ప్రసాద్ చెప్పగా, రెండో దశ స్వైర విహారం చేస్తుండగా ఇంకా నెమ్మదిగా చేస్తున్నామని చెబుతున్నారేంటి అని హైకోర్టు మండిపడింది. వెంటనే ఆర్టిపిసిఆర్ పరీక్షలు పెంచాలని, వివాహాలు, విందులు, అంత్యక్రియల్లో జనం పెరగకుండా నియంత్రణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

పాజిటివ్ కేసులు, మరణించిన వారి సంఖ్య తెలపాలని, జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో పరీక్షల వివరాలు కూడా తెలపాలని సూచించింది. నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై ఎన్ని కేసులు నమోదు చేశారు, ఎంత జరిమానా వసూలు చేసింది 48 గంటల్లో తెలపాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.