FbTelugu

తప్పుడు ఐఏఎస్ లను చూడలేదు: హైకోర్టు సీజే

High-Court-not-seeing-false-IASs-Says-High-Court

ఐఏఎస్ లపై సీజే చౌహాన్ ఘాటు వ్యాఖ్యలు

15 ఏళ్ల సర్వీసులో ఇంతగా అబద్దాలు చెప్పే వారిని చూడలేదు

ఆర్టీసీ ఎం.డి సునిల్ శర్మను ఎందుకు కొనసాగిస్తున్నారు?

మంత్రులను, సీఎం ను సైతం తప్పుదొవ పట్టించారు

సీఎస్ ఎస్ కె.జోషి, సునిల్ శర్మ, రామకృష్ణారావు హాజరు

హైదరాబాద్: ఆర్టీసీ ఇంచార్జ్ ఎం.డి, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ పై హైకోర్టు ఛీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ విరుచుకుపడ్డారు. నా 15 ఏళ్ల జడ్జి చరిత్రలో ఇంతగా అబద్దాలు చెప్పే ఐఏఎస్ అధికారులను ఎక్కడా చూడలేదన్నారు. ఇప్పటి వరకు మూడు రాష్ట్రాల్లో పనిచేసాను కాని హైకోర్టు కు ఇలా ఎవరు అబద్దాలు చెప్పలేదని చౌహాన్ అన్నారు. మంత్రులకు, ముఖ్యమంత్రి కి అబద్ధాల లెక్కలు చెప్పి మోసం చేస్తున్నారు. ఆర్టీసీ ఎండీ సమర్పించిన నివేదిక కూడా మంత్రులని తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి. మంత్రిని ఉద్దేశ పూర్వకంగా తప్పుదోవ పట్టించినట్లు ఆర్టీసీ ఎండీ నివేదికలో స్వయంగా అంగీకరించడం ఆశ్చర్యంగా ఉందని సీజే చౌహాన్ వ్యాఖ్యానించారు. రవాణ శాఖ మంత్రిని, ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తారా అంటూ సునిల్ శర్మపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ బాస్ నే తపుదోవ పట్టించారు… మాకు నిజాలు చెబుతున్నారాని ఎలా నమ్మాలి అని హైకోర్టు ప్రశ్నించింది. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ప్రధాన కార్యదర్శి ఎస్ కె.జోషి, ఆర్టీసీ ఇంఛార్జీ ఎండి సునిల్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు లు స్వయంగా హాజరై వివరణ ఇచ్చారు.

తప్పుదోవ పట్టించిన ఆర్టీసీ ఇంచార్జి ఎం.డి సునిల్ శర్మను రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కావడం లేదు. నిధులు ఇవ్వాల్సిన అవసరం లేనప్పుడు… జీహెచ్ ఎంసీని ఎందుకు అడుగుతున్నారు? జీహెచ్ఎంసీ ఇవ్వాల్సి ఉందని మంత్రికి చెప్పారా? జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, ఆర్థిక శాఖలు ఒక్కొక్కరు ఒక్కో పాట పాడుతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా చెబుతున్నారు. హైకోర్టుతో వ్యవహరించే తీరు ఇదేనా అని అధికారులను నిలదీసింది. అధికారుల నివేదికలపై స్వయంగా వివరణ ఇవ్వాలని సీఎస్‌ ఎస్ కే.జోషీ ని హైకోర్టు ఆదేశించింది.

ఆర్టీసీ ఎండీ సునీల్ పై సీజే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన నివేదికను కోర్టు హలులో సీజే చదివి వినిపించారు. ఆర్టీసీపై మంత్రికి సునీల్ శర్మ తప్పుడు లెక్కలు ఇచ్చారు. మంత్రికి కూడా తప్పుడు లెక్కలు ఇస్తే ప్రభుత్వాన్ని మోసం చేసినట్లేనన్నారు. రాష్ట్ర మంత్రివర్గానికి సైతం అధికారులు తప్పుడు లెక్కలు ఇచ్చారు. సీఎం కేసీఆర్ కు సైతం తప్పుడు లెక్కలు ఇచ్చారు.

ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు సమర్పించిన రెండు నివేదికలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని హైకోర్టు మండిపడింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరించింది. ఐఏఎస్‌ అధికారులు అసమగ్ర నివేదికలు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది. రికార్డులు పరిశీలించాకే నివేదిక ఇస్తున్నట్లు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు కోర్టుకు తెలిపారు. అంటే మొదటి నివేదిక పరిశీలించకుండానే ఇచ్చారా? హైకోర్టు ప్రశ్నించింది. సమయాభావం వల్ల రికార్డుల ఆధారంగా ఈ నివేదిక రూపొందించామని, మన్నించాలని రామకృష్ణారావు హైకోర్టును కోరారు. క్షమాపణ కోరడం సమాధానం కాదని వాస్తవాలు చెప్పాలని హైకోర్టు స్పష్టం చేసింది.

ఆర్టీసీ ఎండి సునిల్ శర్మ, మీరు చెబుతున్న అంకెలు వేర్వేరుగా ఉన్నాయి… మేం వీటిని పరిగణనలోకి తీసుకోవాలా అని హైకోర్టు ప్రశ్నించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తేదీ 2-6-2014 నుండి అక్టోబర్ 2019 వరకు ఉన్న మొత్తం లెక్కలను తాజా నివేదికలో పొందుపరిచామని రామకృష్ణ రావు తెలిపారు. కాగ్ నివేదిక అనుగుణంగా తయారు చేసిన పూర్తి వివరాలతో అందించామని వివరించారు. కోర్టును తప్పుదోవ పట్టించేందుకు చాలా తెలివిగా గజిబిజి లెక్కలు, పదాలు వాడారు. అధికారులు సమర్పించిన నివేదిక పై మరోసారి హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రుణ పద్దుల కింద కేటాయించిన నిధులు అప్పు కాదని, గ్రాంటు అని తెలివిగా చెబుతున్నారని హైకోర్టు ఆక్షేపించింది. ఇంతవరకు ఏ బడ్జెట్ లో అలా చూడలేదు. ప్రధాన న్యాయమూర్తి అడిగిన ప్రతి ప్రశ్నకి నివేదిక ఆధారంగా రామకృష్ణా రావు లెక్కలు చూపిస్తూ సమాధానం చెప్పారు.

You might also like