అమరావతి: ప్రభుత్వ న్యాయవాదుల వ్యవహార శైలి కారణంగా ప్రభుత్వానికి హైకోర్టు వ్యతిరేకం అనే అభిప్రాయం ప్రజలలోకి వెళుతోందని, ఇది ఎవ్వరికీ మంచిది కాదని హైకోర్టు స్పష్టం చేసింది.
మద్యం అక్రమ రవాణా కేసులో సీజ్ చేసిన వాహనాలను విడుదల చేసే అంశంపై హైకోర్టులో జరిగిన విచారణ జరిగింది. ఈ కేసులో డీజీపీ గౌతమ్ సవాంగ్ హైకోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. డీజీపీ కోర్టుకు హజరు కావాల్సినంత కేసు ఇది కాదు.. కానీ హైకోర్టుకు ఎవరైనా సమానమే అని జస్టిస్ దేవానంద్ వ్యాఖ్యానించారు. గౌతమ్ సవాంగ్ నిజాయితీ, నిబద్ధత కలిగిన కలిగిన ఆఫీసర్ అని నాకు తెలుసు అని అన్నారు.
కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొని విధులు నిర్వహిస్తున్నారని పోలీస్ శాఖను అభినందించారు. డీజీపీకి అడ్వకేట్ జనరల్, ప్రభుత్వ తరుపు న్యాయవాదులు సరిగా మార్గనిర్దేశనం చేయడం లేదని జస్టిస్ దేవానంద్ వ్యాఖ్యానించారు. మీ శాఖ లో కింది స్థాయిలో ఉన్న చిన్నచిన్న లోపాలను సరిచేసుకోవాలని సూచించారు.
వాహనాల విడుదలలో అధికారులు నిబంధనలు పాటించలేదని పిటిషనర్ తరపున న్యాయవాది డిఎస్ఎన్వీ ప్రసాద్ బాబు వాదనలు విన్పించారు. కేసుల్లో వున్న వాహనాలు ఆయా శాఖలకు అప్పగించాలని మెమో జారీ చేశామని డీజీపీ తెలపగా, అయినా ఎందుకు వాహనాలు ఇవ్వలేదని జడ్జీ ప్రశ్నించారు. మూడు రోజుల్లో అప్పగించాలని జడ్జీ దేవానంద్ ఆదేశాలు జారీ చేశారు.