FbTelugu

ఈటల భూములపై నివేదిక చెల్లదు: హైకోర్టు

హైదరాబాద్: మెదక్ జిల్లాలో జమునా హేచరీస్ భూముల పై జిల్లా కలెక్టర్ ఇచ్చిన నోటీసులపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుటుంబం వేసిన అత్యవసర పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వినోద్‌కుమార్ తన నివాసంలో విచారణ చేపట్టారు. విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మెదక్ జిల్లా కలెక్టర్, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్, ఏసిబి సంయుక్తంగా మే 1, 2న నిర్వహించిన విచారణను, నివేదికను పరిగణనలోకి తీసుకోవడం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. సర్వే ముందు సంబంధిత భూ యజమానులకు నోటీసులు ఇవ్వాలని, నిబంధనల ప్రకారం సమయం ఇవ్వాలని ఆదేశించింది. శుక్రవారం నోటీసులు ఇచ్చి సోమవారం సమాధానం ఇచ్చేలా ఉండకూడదని హైకోర్టు చురకలు అంటించింది.

ఈటల కుటుంబం తరఫున సీనియర్ న్యాయవాది దేశాయి ప్రకాశ్‌రెడ్డి వాదనలు విన్పించారు. సర్వే చేసేముందు తమకు నోటీసు ఇవ్వలేదని, అధికారులు తమ భూముల్లోకి అక్రమంగా చొరబడ్డారని ప్రకాశ్ రెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్ నివేదికను కూడా ఈటల కుటుంబానికి ఇవ్వలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బిఎస్.ప్రసాద్ వాదనలు విన్పించారు. ఈటలపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినందునే విచారణ జరిపారని ప్రసాద్ తెలిపారు. ప్రైవేటు వ్యక్తుల భూముల్లోకి వెళ్లి సర్వే చేసేందుకు ముందస్తు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదా? అని హైకోర్టు ప్రశ్నించింది. అంతపెద్ద విస్తీర్ణంలో ఉన్న భూముల సర్వే, విచారణ, సాక్షుల వాంగ్మూలం రాత్రికి రాత్రే ఎలా పూర్తయిందని హైకోర్టు నిలదీసింది. ఫిర్యాదు వస్తే ఎవరి ఇంట్లోకైనా వెళ్లి విచారణ చేయొచ్చా? అని హైకోర్టు ప్రశ్నించింది. జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు కారులో కూర్చుని నివేదిక రూపొందించినట్లు కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు ఇస్తూ తదుపరి విచారణ జులై 6వ తేదీకి వాయిదా వేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.