FbTelugu

సహనాన్ని పరీక్షించవద్దు… హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

కరోనా పరీక్షల్లో తెలంగాణ వెనకబడి ఉంది

కేసులు పెరుగుతుంటే ప్రభుత్వం నిద్రపోతున్నదా

అధికారులు వాస్తవాలు దాచి పెడుతున్నారు

హైకోర్టు అభినందించిందని ప్రచారం చేసుకుంటారా?

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరీక్షలు, సమాచారం వెల్లడి తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో సమాధానం చెప్పాలని ప్రశ్నించింది.
బాధ్యతులైన అధికారులపై కేసులు పెట్టి, సస్పెండ్ చేయాలని ఎందుకు ఆదేశించకూడదో చెప్పాలని అడ్వకేట్ జనరల్ (ఏజీ) ప్రసాద్ ను ప్రశ్నించింది. పదే పదే ఆదేశిస్తున్నప్పటికీ ఒక్కటి కూడా అమలు కావడం లేదని హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో ఇవాళ సుదీర్ఘంగా విచారణ కొనసాగింది. తమ సహనాన్ని పరీక్షించవద్దని, ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసింది
ఢిల్లీ, ఏపీ వంటి రాష్ట్రాలతో పోలిస్తే కరోనా పరీక్షల్లో రాష్ట్రం చాలా వెనుకబడి ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఓవైపు కేసులు పెరుగుతుంటే ప్రభుత్వం నిద్రపోతోందని అని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం ప్రతిరోజు రాత్రి విడుదల చేసే హెల్త్ బులెటిన్లలో ఇప్పటికీ సమగ్ర వివరాలు ఇవ్వడం లేదని మండిపడింది. ఆసుపత్రుల వారీగా బెడ్లు, వెంటిలేటర్ల వివరాలు ఇవ్వడం లేదని పేర్కొంది
అధికారులు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను దాచిపెట్టి హైకోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సమాచారం తెలుసుకోవడం ప్రజల ప్రాథమిక హక్కు అని పేర్కొన్నది. కరోనా పరీక్షలు, రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితిపై హైకోర్టు అభినందించిందని హెల్త్ బులెటిన్ లో పేర్కొనడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విఫలమైనట్లు ఓ వైపు మొట్టికాయలు వేస్తుంటే అభినందించినట్లు ప్రజలను ఎలా తప్పుదోవ పట్టిస్తారని హైకోర్టు ప్రశ్నించింది.
ప్రజలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సయ్యద్ ముర్తజా రిజ్వీ వ్యక్తిగతంగా హాజరు కావాలని హైకోర్టు ఆదేశించి విచారణ వాయిదా వేసింది.
ఇక నుంచి జిల్లా కలెక్టర్లు ప్రతిరోజు బులెటిన్ విడుదల చేయాలని ఆదేశించింది. ప్రైమరీ కాంటాక్టు వివరాలు, ర్యాపిడ్ టెస్టు సెంటర్ల వివరాలు కూడా వెల్లడించాలని సూచించింది. పెళ్లిళ్లు, అంత్యక్రియలకు ఎక్కువ మంది హాజరు కాకుండా చూడాలని, ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి విస్తృత ప్రచారం కల్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

You might also like