హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల్లో ఆన్ లైన్ క్లాసులు, జీఓ నెంబర్ 46 పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది.
జీఓ నెంబర్ 46 ను ఉల్లంఘిస్తున్నారని హైకోర్టులో విద్యార్థులు తల్లిదండ్రులు పిటీషన్ దాఖలు చేశారు. కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని జీఓ నెంబర్ 46ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిందని పిటీషన్ లో తెలిపారు. ప్రభుత్వం ఆన్ లైన్ క్లాసులు నిర్వహించుకునేందుకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని అడ్వకేట్ జనరల్ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు.
అనుమతించనప్పుడు ప్రైవేటు పాఠశాలలు ఎలా నిర్వహిస్తున్నాయని హైకోర్టు ప్రశ్నించింది. అలాంటప్పుడు నిబంధనలు ఉల్లంఘిస్తున్న పాఠశాలలపై ఎలాంటి చర్యలు తీసుకున్నదో చెప్పాలని హైకోర్టు నిలదీసింది.కేంద్ర ప్రభుత్వ సీబీఎస్ఈ ఆధ్వర్యంలోని పాఠశాలలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయని ఏజీ చెప్పగా, మీరు చెబుతున్నవి అర్థం కాకుండా ఉన్నాయని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఆన్ లైన్ క్లాసులపై ప్రభుత్వం విధానం ఏమిటో వారం రోజుల్లో చెబుతామని ఆయన తెలిపారు. వారం రోజుల్లో పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 22వ తేదీకు వాయిదా వేసింది.