FbTelugu

అందుకే పెరుగుతున్నాయా..?

కరోనా వైరస్‌ అల్లకల్లోలం చేస్తోంది. ప్రత్యేకించి హైదరాబాద్‌ నగరంలో ఇటీవల పూర్తిస్థాయిలో విజృంభిస్తోంది. కొంతకాలం వరకు తక్కువ కేసులు నమోదు కావడంతో హైదరాబాద్‌ వాసులు ఊపిరి పీల్చుకున్నారు.

కానీ, గత నాలుగు రోజుల నుంచి ఊహించని రీతిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దీంతో హైదరాబాద్‌ వాసుల్లో భయాందోళనలు ఎక్కువయ్యాయి. ప్రధానంగా హైదరాబాద్‌లో జనరద్దీ, మద్యం దుకాణాలు తీసిన తర్వాతే కేసుల సంఖ్య భారీగా పెరిగిందని నగరవాసులు భావిస్తున్నారు.
కారణం ఇదేనా..?
తెలంగాణలో కరోనా టెస్టుల విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఐసీఎంఆర్‌ చెప్పిందన్న కారణంతో వాటి సంఖ్యను బాగా తగ్గించారు. అది కూడా ఏ స్థాయికి తగ్గించారంటే ఒకింట్లో ఒక వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినా ఆ కుటుంబం సభ్యులకు మాత్రం కరోనా లక్షణాలు లేవన్న కారణంతో వారికి టెస్టులు చేయలేదు. వాస్తవానికి ఒక ఇంట్లో ఒకరికి పాజిటివ్‌ అని తేలిన వెంటనే ఆ కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల వారికి కూడా పరీక్షలు చేస్తే ఇప్పుడు వాటి సంఖ్య ఇంతలా పెరిగేది కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఇలా వారికి పరీక్షలు చేయకపోవడం వల్ల కొంతకాలానికి ఆ కుటుంబంలో అందరికీ వైరస్‌ సోకుతుందన్న ప్రచారం సాగుతోంది. వైరస్‌ సోకిన వ్యక్తికి లక్షణాలు బయటపడే సరికి కనీసం 28 రోజులు పడుతుంది. సుమారు ఈ నెల రోజుల్లో అతడి ద్వారా చాలామందికి వైరస్‌ సోకే అవకాశం ఉంది. అయితే, వారికి లక్షణాలు బయటపడేందుకు మరో నెల రోజులు పడుతుంది. మళ్లీ వారిద్వారా ఇతరులకు సోకుతోంది. ఇలా కాంటాక్ట్‌ కేసులు పెరుగుతుండడంతోనే నగరంలో రోజుకు కనీసం 40దాకా కేసులు నమోదవుతున్నట్టు వైద్య నిపుణులు భావిస్తున్నారు.
కుటుంబాలు తక్కువ.. కేసులు ఎక్కువ
వైరస్‌ సోకిన వ్యక్తి ఇంట్లోని వారికి టెస్టులు చేయకపోవడం వల్లే కేసులు పెరుగుతున్నాయనడానికి కొన్ని సంఘటనలను స్థానికులు ఉదహరిస్తున్నారు. నగరంలో భారీగా కేసులు నమోదువున్నా అవన్నీ కేవలం కొన్ని కుటుంబాలకే పరిమితమవుతున్నాయంటున్నారు. రోజుకు 40 కేసులు నమోదవుతున్నా అవి కేవలం నాలుగైదు కుటుంబాల వారికే సోకుతున్నాయంటున్నారు. ఒకే ఇంట్లో ఏడుగురికి, తొమ్మిదిమందికి ఈ వైరస్‌ సోకినట్టు తేలుతోంది. అదే ఆ కుటుంబంలో ఒకరికి వైరస్‌ సోకిన వెంటనే ఆ కుటుంబ సభ్యులకు టెస్టులు చేస్తే పరిస్థితి ఇక్కడివరకు వచ్చేది కాదని వ్యాఖ్యానిస్తున్నారు. కారణం ఏదైనా కరోనా విజృంభణపై నగరవాసులు ఆందోళనకు గురవుతున్నారు.

You might also like