FbTelugu

జోరువాన..

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని వాగులు, చెరువులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నీటి కుండలను తలపిస్తున్నాయి. రహదారులన్నీ జలమయంగా మారుతున్నాయి. రహదారులన్నీ కొట్టుకుపోతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు భారీగా చేరుతోంది. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల లోలెవల్‌ వంతెనలపై నుంచి వరద నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. పంటచేలల్లోకి వరద నీరు చొచ్చుకుపోయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరద నీరు పోటెత్తుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో వర్షం కారణంగా పట్టణంలోని కేసీఆర్‌ నగర్‌ నీట మునిగింది.  మధిర వైరా నంది నుంచి ఎర్రుపాలెం కట్టలేరుకు భారీగా నీరు చేరింది. ఎర్రుపాలెం మండలం రేమిడిచర్ల వద్ద కొండవాగు పొంగి రోడ్లపైకి నీరు భారీగా పొంగిపొర్లుతోంది. దీంతో ఎర్రుపాలెం నుంచి గంగినేని వైపు పాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

ఆదిలాబాద్‌ సరిహద్దులోని పెన్‌ గంగా నదిలోకి వరద నీరు వచ్చి చేరటంతోపాటు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షానికి నదిలో నీటి ప్రవాహం పెరిగింది. జైనథ్‌ మండలం పూసాయి గ్రామ సమీపంలోని వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఆ గ్రామంలోని ఎల్లమ్మ గుడి జలదిగ్భందనమైంది. నార్నూరు మండలం మహాగావ్‌ వంతెనపై నుంచి వరద ప్రవహించడంతో నార్నూర్‌ గాదిగూడ మండలాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆదిలాబాద్, తాంసి, భీంపూర్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, సిరికొండ, బోథ్, బజార్‌ హత్నూర్‌ వర్షం కురియడంతో గ్రామ సమీపంలోని ఒర్రెలు పలు వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. మరోవైపు ఈ వర్షంతో పంటలకు జీవం పోసినట్లైంది. అలాగే వికారాబాద్‌ జిల్లాలోని పరిగిలో నస్కల్‌ వాగు పొంగిపొర్లడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక హైదరాబాద్‌లో బుధవారం ఉదయం 11 గంటల నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు నగరం అతలాకుతలం అయ్యింది. ముఖ్యంగా ఉస్మానియా ఆస్పత్రిలో భారీగా వరదనీరు చేరడంతో పీపీఈ కిట్లు వరదనీటిలో కొట్టుకుపోయాయి. భారీ వర్షానికి రోగులు నానా ఇబ్బందులు పడ్డారు. వైద్యలు పడరాని పాట్లు పడ్డారు. దీంతో విధిలేని పరిస్థితుల్లోనే వైద్యులు రోగులకు వైద్యం అందించాల్సి వచ్చింది. అలాగే నగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ జాం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

రేపటి వరకు ఉపరితల ఆవర్తనాల ప్రభావం

తూర్పు పశ్చిమ షేర్‌ జోన్‌ 18.0 డిగ్రీల వెంబడి 3.1 కి.మీల నుంచి 5.8 కి.మీల ఎత్త మధ్య ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గురువారం, శుక్రవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న గాంగేటిక్‌ పశ్చిమ బెంగాల్‌ ప్రాంతంలో 2.1 కి.మీల నుంచి 5.8 కి.మీల ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది.

ప్రాజెక్టులకు జలకళ

ఇప్పటికే వరుసగా కురుస్తున్న వర్షాలకు పలు జిల్లాలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. శ్రీరామ్‌సాగర్, జూరాలతో పాటు పలుప్రాజెక్టుల్లోనూ భారీగా వరదనీరు చేరుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

You might also like