FbTelugu

ఎట్టకేలకు…!

ఏపీలో ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను నియమించే పంచాయితీ ఎట్టకేలకు ముగిసింది. అనేక మలుపులు తిరిగిన ఈ వ్యవహారంలో చివరకు నిమ్మగడ్డే విజయం సాధించారు. తన పదవిని తిరిగి సాధించారు. అతడికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పదవిని అప్పగించేందుకు గురువారం అర్ధరాత్రి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఎన్నో ములపులు, రాజకీయ విమర్శలకు దారితీసిన వ్యవహారంపై చివరకు రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. హైకోర్టు చీవాట్లు, సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో ఎట్టకేలకు జగన్‌ సర్కారు వెనక్కి తగ్గింది. అన్ని దారులూ మూసుకుపోయాయని గ్రహించి నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించింది. గురువారం అర్ధరాత్రి దీనికి సంబంధించిన జీవోను జారీ చేసింది. కరోనా కమ్ముకొస్తున్న నేపథ్యంలో రమేశ్‌ కుమార్‌ స్థానిక ఎన్నికలను వాయిదా వేయడం సర్కారు పెద్దలకు ఆగ్రహం తెప్పించిన సంగతి తెలిసిందే.

అప్పటి నుంచే ఆయనను తొలగించడంపై దృష్టి సారించారు. ‘సంస్కరణల’ పేరిట ఎస్‌ఈసీ పదవీకాలాన్ని కుదిస్తూ ఆర్డినెన్స్‌ జారీ చేశారు. ‘మీ పదవీకాలం పూర్తయింది’ అంటూ రమేశ్‌కుమార్‌కు ప్రభుత్వం ఉద్వాసన పలికింది. ఆయన స్థానంలో రాత్రికి రాత్రే తమిళనాడుకు చెందిన రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ కనగరాజ్‌ను నియమించింది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న తనను అర్ధంతరంగా తొలగించడం కుదరదని రమేశ్‌ కుమార్‌ న్యాయపోరాటం ప్రారంభించారు. ఈ విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. హైకోర్టులో, సుప్రీంకోర్టులో వ్యతిరేక నిర్ణయాలు వచ్చినా… రమేశ్‌ కుమార్‌ను తిరిగి ఎస్‌ఈసీగా నియమించేందుకు ప్రభుత్వ పెద్దలకు మనసు రాలేదు.

దీంతో ఆయన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ నిలిపి వేయాలంటూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా… స్టే ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. పైగా… హైకోర్టు తీర్పు అమలు కోసం గవర్నర్‌ జోక్యం చేసుకోవాల్సి రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. కోర్టు ధిక్కరణ పిటిషన్‌ హైకోర్టులో త్వరలో విచారణకు రానుంది. అలాగే… జడ్జిలను దూషించడానికి సంబంధించిన ఆధారాలను నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ శుక్రవారం సుప్రీంకోర్టుకు అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ కేసులో సుప్రీం తదుపరి విచారణ ఆగస్టు 5న జరగనుంది. ఇప్పటిదాకా జరిగిన పరిణామాలన్నీ చూస్తే… ఇక అన్ని దారులూ మూసుకుపోయినట్లేనని, కోర్టు తీర్పు అమలు చేయకపోతే తలబొప్పి కట్టడం ఖాయమని సర్కారు భావించినట్లు తెలుస్తోంది. రమేశ్‌కుమార్‌ను ఎస్‌ఈసీగా పునరుద్ధరిస్తూ గవర్నర్‌ పేరిట నోటిఫికేషన్‌ జారీ కాగా… దానిపై పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది గురువారం అర్ధరాత్రి జీవో జారీ చేశారు.

రమేశ్‌కుమార్‌ సోమవారం బాధ్యతలు స్వీకరిస్తారు. ఇప్పటిదాకా హాట్‌హాట్‌గా సాగిన నిమ్మగడ్డ వ్యవహారం ఏపీలో ఇక సద్దుమణిగింది. ఈ పరిణామాలు చూస్తున్న రాజకీయ వర్గాలు మాత్రం జగన్‌ సర్కారు భేషజానికి పోయి పరువు పోగొట్టుకోవడం తప్ప నిమ్మగడ్డ వ్యవహారంలో జగన్, అతడి ప్రభుత్వం సాధించింది ఏముంది.. చివరకు కోర్టు అక్షింతలు తిని అతడినే నియమించాల్సి వచ్చింది కదా అని వ్యాఖ్యానిస్తున్నారు.

You might also like