లక్నో: ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఒకరి తరువాత మరొకరు చొప్పున మొత్తం పది మంది మహిళలను వివాహం చేసుకున్నాడు. వారితో సంసారం కూడా చేశాడు. ఏమైందో ఏమో కాని ఊరి దగ్గరిలోని పంటపొలం వద్ద శవమయ్యాడు.
బరేలి జిల్లాకు చెందిన జగన్ లాల్ యాదవ్ (57) అనే రైతు ఇప్పటి వరకు పది మంది మహిళలను వివాహమాడాడు. 1990 లో మొదటి వివాహం చేసుకోగా, అందులో ఐదుగురు భార్యలు చనిపోయారు. ఈయన వ్యవహార శైలి నచ్చక మరో ముగ్గురు వేరే వారితో లేచిపోయారు. ప్రస్తుతం ఇద్దరు భార్యలతో కాపురం చేస్తున్నాడు. గురువారం నాడు పంట పొలం వద్ద శవమై కన్పించడంతో చూసిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
జగన్ లాల్ యాదవ్ మృతిపై కేసు నమోదు చేశామని భోజిపుర పోలీసులు తెలిపారు. ఒకరి తరువాత మరొకరు చొప్పున మొత్తం 10 మందిని వివాహం చేసుకోవడంతో తండ్రి విసిగిపోయాడు. అతనికి ఇవ్వాల్సిన ఆస్తిని సోదరుడికి రాసిచ్చాడు. తన ఆస్తి సోదరుడికి రాసివ్వడంపై ఆగ్రహించిన జగన్ లాల్ పంచాయతీ పెట్టి తిరిగి దక్కించుకున్నాడు. ఇంత మందిని వివాహం చేసుకున్న ఒక్కరికి కూడా పిల్లలు కలుగలేదు. భార్య మొదటి భర్తకు పుట్టిన కుమారుడితో ప్రస్తుతం ఉంటున్నాడు. ఆస్తి కోసమే బంధువులు హత్య చేయించారనే సమాచారం అందిందని పోలీసులు తెలిపారు.