కొలకత్తా: బీజేపీ ఎమ్మెల్యే మూసివేసి ఉన్న దుకాణం ముందు ఉరేసుకుని చనిపోవడం సంచలనంగా మారింది. ఈ ఘటన ఉత్తర దినాజ్ పూర్ జిల్లాలోని బిందాల్ గ్రామంలో సోమవారం ఉదయం చోటు చేసుకున్నది.
ఆందోళనకరమైన అంశమేమంటే తన ఇంటికి కిలోమీటర్ దూరంలో ఒక దుకాణం ముందు ఉరి వేసుకుని చనిపోవడం అనేక ఆరోపణలకు తావిస్తోంది. ఉత్తర దీనాజ్ పూర్ నుంచి దేవేంద్రనాథ్ రాయ్ గెలుపొందారు. రిజర్వుడు సీటు నుంచి గెలుపొందిన ఆయన 2019 లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ ఆత్మహత్యపై బీజేపీ రాష్ట్ర శాఖ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. తన ఇంటి సమీపంలోనే ఎమ్మెల్యే దేవేంద్రనాథ్ రాయ్ ఉరేసుకున్నారని బీజేపీ రాష్ట్ర శాఖ ట్వీట్ చేసింది. ఆయనను ఎవరో చంపారు, ఆ తరువాతే ఉరేశారు. ఆయన బీజేపీలో చేరడం చేసిన తప్పేమోనని ట్వీట్ చేశారు. అయితే ఈ ఉదంతంపై గవర్నర్ జగదీప్ ధన్కర్ స్పందించారు.
ఎమ్మెల్యే ఆత్మహత్య అనేక ఆరోపణలకు తావిస్తోందన్నారు. హత్య చేశారనే ఆరోపణలు ఉన్నాయి. సత్యాన్ని వెలికితీసేందుకు నిష్పక్షపాతమైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని గవర్నర్ ట్వీట్ చేశారు.