FbTelugu

చేతులెత్తేసినట్టేనా?

ఇండియాలో కరోనా కేసుల సంఖ్య రోజుకు పదివేల దాకా నమోదవుతున్నాయి. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయినా, ప్రభుత్వాలు  వాటి గురించి పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

కరోనా విజృంభిస్తున్న కాలంలో లాక్‌డౌన్‌ను నిర్వీర్యం చేసి అనేక రంగాలకు సడలింపులు ఇస్తున్నారని, వీటివల్లనే కేసుల సంఖ్య భారీగా పెరుగున్నాయన్న విషయం దేశంలోని పౌరులందరికీ తెలిసిన విషయమే. కానీ, సర్కారు ఇలాంటి పరిస్థితుల్లో మరింత కట్టడి చేయాల్సింది పోయి సడలింపుల మీద సడలింపులు ఇవ్వడాన్ని చూస్తుంటే కరోనాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేసినట్టే కనిపిస్తుందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. వాస్తవానికి తక్కువ కేసులు నమోదైనప్పుడు లాక్‌డౌన్‌ అమలు చేసి.. అవి మరింతగా విజృంభిస్తున్న కాలంలో దానిని  గాలికొదిలేయడం ఏం లాజికో అర్ధం కావడం లేదని జనం ప్రశ్నిస్తున్నారు.

పైగా కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని, దానిని అదుపు చేయడం ప్రభుత్వం చేతిలో లేదని మంత్రులు చెప్పడాన్ని చూస్తే ప్రభుత్వ విధానం ఏమిటో అర్ధమవుతోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. తెలంగాణలో కూడా రోజుకు 100కు పైగానే కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో సర్కారు 50 సంవత్సరాలు దాటి లక్షణాలు లేని కరోనా రోగులను ఆస్పత్రుల నుంచి ఇంటికి పంపాలని నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటించారు. అయితే, లక్షణాలు లేకుండానే వ్యాధి సోకుతుందని డాక్టర్లు నెత్తీనోరు బాదుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారిని ఇంటికి పంపిస్తే వారి ద్వారా కుటుంబ సభ్యులకు, సమీపంలోని వారికి కూడా ఈ వైరస్‌ సోకే ప్రమాదం ఉంది.

కానీ, ఇవేవీ ఆలోచించకుండా 50 ఏళ్లు దాటిన కరోనా బాధితులను ఇంటికి పంపడమంటే.. కరోనా చికిత్సపై ప్రభుత్వ విధానం ఏమిటోనన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మరింత పకడ్బందీగా చికిత్స అందించాల్సిన సమయంలో వారిని అలా గాలికొదిలేయడం ఎంతవరకు సబబు అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ప్రభుత్వాలు కరోనా చికిత్సల విషయంలో ఒక్కొక్కటిగా తప్పుకుంటూ పోతున్నదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే, కరోనా విషయంలో ప్రభుత్వం వైఖరి ఏమిటో మాత్రం అర్ధం కావడం లేదని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

You might also like