ఫైజర్ పై పంజా విసిరిన హ్యాకర్లు

వాషింగ్టన్: తన ఎలక్ట్రిక్ కార్ల సమాచారాన్ని చైనీయులు దొంగిలించారని టెస్లా అధినేత ఎలన్ మాస్క్ ఆరోపణలు మరువక ముందే ఫైజర్ వ్యాక్సిన్ సమాచారం కోసం హ్యాకింగ్ చేయడం సంచలనం రేపుతోంది.
కరోనా వ్యాక్సిన్ కు సంబంధించిన వివరాలను తస్కరించారని ఫైజర్, బయో ఎన్ టెక్ సంస్థలు అంగీకరించడం కలకలం సృష్టిస్తున్నది. యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ పై సైబర్ దాడి జరిగిందని, వ్యాక్సిన్ సమాచారాన్ని హ్యాకర్లు చోరీ చేశారని ఈ రెండు సంస్థలు అధికారికంగా వెల్లడించాయి. వ్యాక్సిన్ కు సంబంధించిన సమీక్ష పై ఈ దాడి ప్రభావం ఉండబోదని ఏజెన్సీ తమకు హామీ ఇచ్చిందన్నారు. సైబర్ దాడి ఎలా జరిగింది, ఎవరు బాధ్యత వహిస్తారు అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
అమెరికాకు చెందిన ఫైజర్, జర్మనీకి చెందిన బయో ఎన్ టెక్ సంస్థలు సంయుక్తంగా కోవాక్స్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశాయి. ఈ వ్యాక్సిన్ సత్ఫలితాలు ఇవ్వడంతో అత్యవసరం కింద వినియోగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం అనుమతించింది. డిసెంబర్ 8వ తేదీ నుంచి 80 ఏళ్లకు పైబడిన వృద్దులు, వైద్య సిబ్బందికి ఇచ్చే కార్యక్రమం ప్రారంభించిన విషయం తెలిసిందే.