FbTelugu

ముదురుతున్న వివాదం

చైనా, అమెరికా దేశాల మధ్య వివాదాలు ఇప్పటివి కాదు. కమ్యూనిస్టు దేశమైన చైనా, క్యాపిటలిస్టు దేశమైన అమెరికా మధ్య అనేక అంశాల్లో వివాదాలు కొనసాగుతున్నాయి.

అయితే, చాలాకాలం నుంచి ప్రపంచంలో తమ ఆధిపత్యం కొనసాగాలని ఈ రెండు దేశాలు పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం అమెరికా ప్రపంచంలో పెద్దన్నగా వ్యవహరిస్తోంది. వ్యాపార పరంగా మాత్రం చైనా ప్రపంచంలోనే అగ్రభాగాన ఉంది. వారి ఉత్పత్తులు అన్ని దేశాల్లోనూ చౌకగా దొరుకుతున్నాయి. అయితే, తాజాగా ఈ రెండు దేశాల మధ్య కరోనా మరింత అగ్గిని రాజేసింది.

వైరస్‌ చైనా నుంచే ప్రపంచ దేశాలకు పాకడంతో అమెరికా చైనాపై గుర్రుగా ఉంది. ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని సాధించేందుకే కావాలని చైనా కరోనా వైరస్‌ను తయారు చేసి ప్రపంచం మీదకు వదిలిందని అమెరికా అధ్యక్షుడు ఆరోపించారు. దీనికి ఆ దేశం తగిన మూల్యం చెల్లించాలని కూడా డిమాండ్‌ చేశారు. ఇదే బాటలో ఇండియాలాంటి దేశాలు కూడా నిలిచాయి. చైనాలో ఉన్న అమెరికా కంపెనీలన్నింటినీ అక్కడ నుంచి తరలిస్తామని కూడా ప్రకటించింది.

ఎట్టి పరిస్థితుల్లోనూ చైనా ఆగడాలను ఉపేక్షించేది లేదని కూడా చెప్పారు. ఇదే సమయంలో అమెరికా, చైనా మధ్య వాణిజ్యపరంగానే కాకుండా విమాన రాకపోకలకు సంబంధించిన అంశాలపై కూడా ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. జూన్‌ 16 నుంచి అమెరికాకు తిరిగే నాలుగు చైనా ఎయిర్‌లైన్స్‌ షెడ్యూల్డ్‌ ప్యాసింజర్‌ విమానాలను నిలిపివేయనున్నట్టు అమెరికా పాలనా యంత్రాంగం ప్రకటించింది. దీంతో ఈ రెండు దేశాల మధ్య పంచాయితీ మరింత పెరిగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

You might also like