బ్లాక్ అండ్ వైట్ నుంచి స్కోప్‌ల వరకూ.. వెండితెరపై కనిపించని రాజకీయాలుంటాయి. అద్దాలమేడలో ఉన్న తారలంతా.. తాము సురక్షితంగా ఉండేందుకు తన పక్కన మందీమార్బలం సిద్ధం చేసుకుంటారు. నమ్మినబంటు ద్రోహంతో రోడ్డునపడ్డ కాంతారావు, రాజనాల, సావిత్రి వంటి వారున్నారు.
ఎవరిని ఎక్కడ ఉంచాలో తెలిసి.. స్టార్లుగా ఎదిగిన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి వంటి తారాగణమూ లేకపోలేదు. కాలం మారినా.. తెలుగు తెరపై స్వతహాగా ఉండే కొన్ని అవలక్షణాలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. కాలంతోపాటు నడచివస్తున్నాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్లు అంటూ చెప్పినా ఇద్దరి మధ్య పోటీ యుద్ధ వాతావరణాన్ని తలపించేది. తమను కాదన్న హీరోయిన్‌కు అవకాశాలు తొక్కేసిన ఘన చరిత్ర కూడా ఉందంటూ ఆరోపణలు లేకపోలేదు. మద్రాస్ నుంచి హైదరాబాద్ సినీ పరిశ్రమ వచ్చాక.. దాసరి నారాయణరావు అంతా తానై నడిపించారు.
రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి వంటి దర్శక దిగ్గజులు కూడా ఆయన మాటను వింటూనే వచ్చామనిపించారు. అది 1980, 90 మరి ఇది 2020 ట్వంటీట్వంటీ క్రికెట్ మ్యాచ్‌ను మించిన వేగం. పైగా కరోనా కాలం.. లాక్‌డౌన్‌తో సినీ పరిశ్రమ కోట్లు నష్టం కూడగట్టుకుంది. హీరోలు షూటింగ్‌లు లేక.. సినిమాలు చేయలేక వందలకోట్లు నష్టాన్ని చవిచూశారు. అందుకే.. వీలైనంత త్వరగా తమకు అనుమతి ఇవ్వమంటూ ఇటీవల చిరంజీవి, నాగార్జున తదితర బ్యాచ్ సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఆయన కూడా చూద్దామంటూ సానుకూలంగా స్పందించాడు. ఏపీలో జగన్ కూడా ఓకే.. అంటూ స్పందించారంటూ చిరంజీవి ఇటీవల చెప్పారు.
అయితే ఎన్టీఆర్ కుటుంబంలో ఎవ్వరూ కూడా సినీ రంగ పెద్దలుగా ముందుకు రాలేదు. బాలయ్యబాబు చూస్తే.. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అసలే కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు మధ్య కోల్డ్‌వార్ ఉండనే ఉంది. పైగా జగన్‌తో మాంచి దోస్తీ ఉందాయె. అందుకే.. తెలుగు సినీ ఇండస్ట్రీ తరపున జరిగే కార్యక్రమాల్లో హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కనిపించరు.
కాసేపు పదవి పక్కనబెట్టి సినిమా రంగ తరపున పాల్గొనే అవకాశం ఉన్నా.. ఎవరో పెద్దరికం వహిస్తుంటే.. బాలయ్య వారి వెనుక ఉండటాన్ని జీర్ణించుకోవటం కష్టమే. అందుకే.. నందమూరి కుటుంబం ఇటువంటి సమావేశాలకు దూరంగా ఉందట. అయితే.. మొన్న సినీ పెద్దలు సీఎం కేసీఆర్‌ను కలసి సంగతి కూడా తాను పత్రికల్లో చూశానంటూ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బాలయ్య సంచలనాత్మక కామెంట్స్ చేశారు. మరి వాటి ఉద్దేశం ఏమిటీ.. నిజంగానే సినీరంగంలో కరోనా మించిన వైరస్ ఉందన్నమాటే