FbTelugu

పీటలెక్కే గంట ముందు వరుడు మృతి…

మహబూబాబాద్: మరో గంటలో పెళ్లి కుమారుడు పీటలెక్కాల్సి ఉంది. పెళ్లి కుమార్తె కూడా వేదిక వద్దకు చేరుకున్నది, ఏమైందో ఏమో కాని ముహూర్తానికి గంట ముందుగా పెళ్లి కుమారుడు అకస్మాత్తుగా ప్రాణాలు విడిచాడు.

అందరూ ఎదురుచూస్తున్న ఈ సమయంలో పెళ్లి కొడుకు చనిపోయాడనే వార్త ఆ కుటుంబాలలో విషాదం నింపింది. ఈ ఘటన అమనగల్ లో చోటు చేసుకుంది. ఆమనగల్ గ్రామానికి చెందిన బైరబోయిన మల్లయ్య, మల్లమ్మ దంపతులకు కుమారుడు నరేష్ (25) కు పెళ్లి నిశ్చయమైంది.

నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో వివాహం కుదిరింది. 8వ తేదీ శనివారం రాత్రి 11 గంటల 27 నిమిషాలకు ముహూర్తం నిర్ణయించారు. పెళ్లికి ముందే వరుడు నరేష్ తనకు ఆరోగ్యం బాగా లేదని చెప్పడంతో తల్లిదండ్రులు కంగుతిన్నారు. ముహూర్తం దగ్గరపడడంతో స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చూపించి ఇంటికి తీసుకువచ్చారు. నలతగా ఉందని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న నరేష్ ఆ నిద్రలోనే చనిపోయాడు.

మంచంపై పడుకున్న వరుడు ఎంతకీ నిద్ర లేపినా లేవకపోవడంతో మళ్లీ వైద్యుడ్ని పిలిచారు. పరీక్షించిన వైద్యుడు వరుడు చనిపోయాడని చెప్పడం తో అక్కడున్నవారు కన్నీరుమున్నీరు అయ్యారు.

You might also like