FbTelugu

ప్రైవేట్ హెలికాప్టర్లు, ఫ్లైట్లకు పచ్చజెండా

ఢిల్లీ: కేంద్రం ప్రభుత్వం నెమ్మది నెమ్మదిగా లాక్ డౌన్ సడలింపులు ఇస్తోంది. ఇవాళ ప్రైవేట్ హెలికాప్టర్లు, ఛార్టర్డ్ ఫ్లైట్లకు అనుమతించింది.

డొమెస్టిక్ విమానాలు తిరిగేందుకు అనుమతించిన కేంద్రం పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకుల కోసం ఛార్టర్డ్ ఫ్లైట్లు, హెలికాప్టర్లు తిరిగేందుకు వెసులుబాటు కల్పించింది. ఒకే రాష్ట్రంలో అయితే ఎలాంటి ఇబ్బంది లేదని, పొరుగు రాష్ట్రం వెళ్లాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని పౌర విమానయాన శాఖ స్పష్టం చేసింది. దేశీయ విమానాలకు వర్తించే మార్గదర్శకాలే వీటికి కూడా వర్తిస్తాయని తెలిపింది.

అయితే ప్రయాణానికి 45 నిమిషాల ముందుగా ఎయిర్‌పోర్టు లకు చేరుకొని థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. వృద్ధులు, గర్భవతులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ప్రయాణాలను మానుకోవడమే మంచిదని తెలిపింది. వీటి అద్దె విషయంలో ఆపరేటర్, వినియోగదారుడు పరస్పరం మాట్లాడుకొని నిర్ణయించుకోవాలని కేంద్రం పేర్కొంది. అలాగే ఆహారం వెంట తెచ్చుకోవాలని, వెబ్‌ చెక్ ఇన్, ఎలక్ట్రానిక్ పేమెంట్ తప్పనిసరని తెలిపింది. ఫేస్ మాస్క్‌ ధరించాలని, ఆరోగ్య సేతు యాప్‌ తప్పనిసరి చేసింది. ప్రయాణం పూర్తైన తరువాత ఎయిర్‌క్రాఫ్ట్, హెలికాప్టర్‌ని తప్పనిసరిగా శానిటైజ్‌ చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ ఆదేశించింది.

You might also like